డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపీ కృష్ణ కొటారు .. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదటి ప్రయత్నంగా తన కుమార్తె శ్రీజ కొటారు పాడి, నటించిన ‘‘స్వప్నాల నావ’’ వీడియో చిత్రీకరణను ప్రారంభించారు. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా రూపొందిస్తున్న ఈ పాటని ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఈ పాటకు పార్ధసారధి నేమాని స్వరాలు సమకూర్చగా.. యశ్వంత్ సాహిత్యం అందజేశారు. ప్రముఖ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య చిత్రీకరణ చేశారు. ఈ మ్యూజిక్ వీడియోకి బుజ్జి.కే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పూర్తిగా అమెరికాలోని డల్లాస్ నగరంలో చిత్రీకరించిన స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భగా జరిగిన వీడియో లాంచ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని నిర్మాత గోపీకృష్ణ కొటారు, కుమారి శ్రీజ కొటారును అభినందించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందన్నారు గోపీకృష్ణ . ఆయనే ఉండి ఉంటే యువతరానికి తన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తారన్న ఆలోచనలో నుంచే స్వప్నాల నావ పాట చేయాలనే భావన కలిగిందని గోపికృష్ణ తెలిపారు.
పార్ధసారథి నేమాని మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రిగారిలాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లల కోసం ఈ పాట చేశామన్నారు. ఈ పాటను ఆలపించిన శ్రీజకు ప్రొఫెషనల్ సింగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని పార్ధు ప్రశంసించారు. ఎన్నో పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించిన వీఎన్ ఆదిత్య ఈ పాటకు దర్శకత్వం వహించడం గొప్ప విషయమన్నారు పార్ధసారథి.
దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఎన్నిసార్లు కిందపడితే అంతగా మనిషి పైకి వస్తాడని అన్నారు . గోపీకృష్ణ కొత్త ప్రయాణం మొదలుపెట్టారని.. ఆయన జర్నీ సక్సెస్ కావాలని వీఎన్ ఆదిత్య ఆకాంక్షించారు. శ్రీజ ప్రతిభ, గాత్రం చూస్తే ప్రొఫెషనల్ సింగర్‌గా అనిపించిందే కానీ అప్పుడే అరంగేట్రం చేసిన యువతిలా కనిపించలేదని ప్రశంసించారు. ‘‘స్వప్నాల నావ’’ పాటను వీలైనంత త్వరగా చిత్రీకరణ జరిపి మీ ముందుకు తీసుకొస్తామని ఆదిత్య వెల్లడించారు.
Also Read;శబరిమలకు పోటెత్తిన భక్తులు..