రూ. కోటికి చేరిన స్వ‌చ్ఛ ఉల్లంఘ‌న‌ల‌ జ‌రిమానాలు

531
swachh hyderabad
- Advertisement -

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో స్వ‌చ్ఛ‌త‌కు భంగం క‌లిగించి బాద్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించే వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు జ‌రిమానాలను జీహెచ్ఎంసీ విధిస్తోంది. దీనిలో భాగంగా గ‌త మాసం 25వ తేదీ నుండి జీహెచ్ఎంసీ అధికారులు చేప‌ట్టిన ఈ స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా నేటి వ‌ర‌కు 8,500ల‌కు పైగా వ్య‌క్తులు, సంస్థ‌ల‌కు కోటి రూపాయలకు జ‌రిమానాలు విధించారు.

భవన నిర్మాణ వ్యర్థ పదార్థాలు రహదారులపై వేయడం, రోడ్ల‌పై చెత్త వేయ‌డం, చెత్త‌ను త‌గ‌ల‌బెట్ట‌డం, నాలాలో వ్య‌ర్థాలు వేయ‌డం, బహిరంగ మల మూత్ర విసర్జన త‌దిత‌ర అంశాల‌పై ఈ జ‌రిమానాల‌ను విధిస్తున్నారు. తడి పొడి చెత్త ల కై ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటుచేసినా సవ్యంగా వాటిని సద్వినియోగ పరచు కోకుండా, నిర్లక్ష్యంగా రోడ్లమీద పడ వేయడంపై ప్రజా బాహుళ్యంలో చైతన్యం తెచ్చేందుకు జిహెచ్ఎంసి పలు విన్నూత్న కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయిన‌ప్ప‌టికీ కొంత మంది న‌గ‌ర‌వాసుల్లో మార్పు రానందున మొత్తం హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిశుభ్ర‌త‌కు ప్ర‌తికూలంగా మారింది. అయితే వీరిలో కూడా మార్పు తేవ‌డానికి జీహెచ్ఎంసీ స్వచ్ఛ, సాఫ్‌, షాన్‌దార్ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మాలను చేప‌ట్టి ప్ర‌తి స‌ర్కిల్‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌లతో సంపూర్ణ స్వ‌చ్ఛ‌త‌కై పెద్ద ఎత్తున చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.

దీంతో పాటు స్వ‌చ్ఛ ఉల్లంఘ‌న‌ల‌పై కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి జ‌రిమానాల‌ను కూడా విధిస్తున్నారు.
జ‌రిమానాల్లో చందాన‌గ‌ర్, శేరిలింగంప‌ల్లి స‌ర్కిళ్లు టాప్‌ మే 24వ తేదీ నుండి చేప‌ట్టిన ఈ డ్రైవ్‌లో చందాన‌గ‌ర్‌స‌ర్కిల్‌ అత్య‌ధికంగా 518 జ‌రిమానాల ద్వారా రూ. 16,90,300 వ‌సూలు చేసింది. శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌లో 312 జ‌రిమానాల ద్వారా రూ. 13,90,200, ఖైర‌తాబాద్ స‌ర్కిల్‌లో 627 జ‌రిమానాల ద్వారా రూ. 8,41,400, జూబ్లీహిల్స్ స‌ర్కిల్ లో 462 జ‌రిమానాల ద్వారా రూ. 6,85,800, మూసాపేట్ సర్కిల్ లో 350 జరిమానాల ద్వారా రూ. 5,15,150, ఉప్పల్ సర్కిల్ లో 417 జరిమానాల ద్వారా రూ. 4,53,670, ముషిరాబాద్ సర్కిల్ లో 402 జరిమానాల ద్వారా రూ. 4,31,900, బేగంపేట్ స‌ర్కిల్‌లో 323 జ‌రిమానాల ద్వారా రూ. 3,08,200 వ‌సూలు చేశారు. అతిత‌క్కువ‌గా ఆర్.సి పురం స‌ర్కిల్‌లో 45 జరిమానాల ద్వారా రూ. 60,400, గాజుల రామారం సర్కిల్ లో 84 జరిమానాల ద్వారా రూ. 74,990 విధించారు.

స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌, సాఫ్ హైద‌రాబాద్ – షాన్‌దార్ హైదరాబాద్ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా పెద్ద ఎత్తున స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు చేస్తూ నగర స్వచ్ఛతకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నప్పటికీ కొందరు బాద్య‌తార‌హితంగా వ్యవహరిస్తున్నారని, వీరిలో మరింత మార్పుకు దోహదం చేసే విధంగానే ఉల్లంఘనల జరిమానాలు విధించడం జరుగుతుందని, జిహెచ్ఎంసి ఆదాయాన్ని పెంచేందుకు మాత్రం కాదని బల్దియా స్పష్టం చేసింది.

- Advertisement -