విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లి గూడెం యస్.వి.ఆర్. సర్కిల్, కె.యన్.రోడ్ లో ఆవిష్కరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25(ఆదివారం)న ఉదయం 10.15 నిమిషాలకు ఎస్వీఆర్ అభిమానుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే అనుకోని పరిస్ధితుల కారణంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని …త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జన్మించారు. 18 జూలై 1974లో పరమపదించారు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో నటించారు. షేక్ స్పియర్ డ్రామాల్లో నటించిన అనుభవంతోనే సినీనటుడు అయ్యారు.
చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయన నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు.
రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ బిరుదులు అందుకున్నారు.