పురందేశ్వరి పోటీపై సస్పెన్స్?

26
- Advertisement -

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ యాక్టివ్ గా మారింది. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల దృష్ట్యా ఆమె అడుగులు ఎటు పడబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారా ? లేదా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. .

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అంత తేలికైన విషయం కాదు. నియోజకవర్గంలో స్థానికంగా బలం ఉండడంతో పాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఓడించే సామర్థ్యం ఉండాలి. ఈ నేపథ్యంలో బీజేపీకి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఆదరణ లేదు, అందువల్ల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిస్తే ఓడిపోవడం ఖాయమనే భయం పురందేశ్వరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కుదిరితే నరసాపురం లేదా రాజమండ్రి ఎంపీ సీటుకు ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం నరసాపురం సిట్టింగ్ ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉన్న సంగతి తెలిసిందే.

ఆయన వైసీపీ వీడి టీడీపీ లేదా బీజేపీ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయన తిరిగి నరసాపురం బరిలో నిలిస్తే.. పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో పార్టీ అధ్యక్షురాలు కావడంతో ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడమే ఉత్తమం అని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయ పడుతోందట. మరి ఆమె ఎటు వైపు అడుగులు వేస్తారనేది చూడాలి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే సీట్ల కేటాయింపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ ప్రకటనలో పురందేశ్వరి పోటీ చేసే స్థానంపై క్లారిటీ రానుంది.

Also Read:Modi:పెద్ద ప్లానే ఇది.. మోడీజీ!

- Advertisement -