ప్ర‌జ‌ల గుండెల్లో చిన్న‌మ్మ‌…

398
sushma history
- Advertisement -

సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, తన వాగ్దాటితో ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న నాయకురాలు సుష్మా స్వరాజ్‌. ఆమె హఠాన్మరణంతో యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురైంది. విద్యార్థి దశ నుంచి రాజకీయాలవైపు ఆకర్షితురాలైన సుష్మా.. సుప్రీం లాయర్‌గా పనిచేశారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 25 ఏళ్లకే హర్యానా మంత్రిగా పని చేసి శభాష్ అనిపించుకున్నారు.

ఉక్కు మహిళగా,బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా దేశ రాజకీయాల్లో అగ్ర నాయకురాలిగా ఎదిగారు సుష్మాస్వరాజ్‌.ఒకానొక దశలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో పోటీపడ్డారు. సోనియా ప్రధాని అయితే గుండు గీయించుకుంటానంటూ సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు.

విద్యార్థి నేతగా,సుప్రీం కోర్టు లాయర్‌గా,కేంద్రమంత్రిగా,ఢిల్లీ సీఎంగా,బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా ఇలా చిన్న వయసులోనే ఏ పదవి వచ్చినా వెనుకడుగు వేయలేదు. తన చివరి శ్వాస వరకు నమ్మిన సిద్దాంతం కోసం పనిచేశారు. అందుకే రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

21 ఏళ్లకే పెళ్లి,25 ఏళ్ల వయసులో మంత్రి,27 ఏళ్ల వయసులోనే హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలు,ఓ జాతీయ పార్టీకి తొలి మహిళా అధికార ప్రతినిధి,బీజేపీ తొలి మహిళా సీఎం,ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ శాఖ చేపట్టిన రెండో మహిళా. ఇలా ఏ పదవి చేపట్టిన సుష్మా ప్రత్యేకతను చాటుకుంది.

భారత్‌కు అత్యవసర వైద్యం కోసం వచ్చే పాకిస్థానీలకు ఆమె చేసిన సాయం వారు జీవితాంతం మరిచిపోలేరు. అంతేగాదు కేంద్రమంత్రిగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడంలో ఆమె చూపిన చొరవ అమోఘం. తెలంగాణ చిన్నమ్మగా ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపించారు సుష్మా. సోదరి సోదరిమణులారా తెలంగాణ కోసం బలిదానాలు వద్దు…తెలంగాణ చూడటానికి బ్రతకాలి అంటూ  ఆమె చేసిన ప్రసంగాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తంగా చిన్న వయస్సులోనే ఉన్నత స్ధాయికి ఎదిగిన సుష్మా అంతే చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

- Advertisement -