నోట్ల రద్దు ఎఫెక్ట్‌.. లొంగిపోతున్న అన్నలు

218
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజల పైనే కాదు.. అడవుల్లోని మావోయిస్టుల‌పై కూడా తీవ్ర‌ ప్ర‌భావం చూపిస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేయడంతో వాటిని ఉపయోగించే తమ అవసరాలను తీర్చుకునే మావోయిస్టులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నోట్ల రద్దు అనంతరం 28 రోజుల్లోనే 564మంది మావోయిస్టులు, సానుభూతి పరులు పోలీసులకు లొంగిపోయారు. గతంతో పోలిస్తే ఇప్పుడు లొంగిపోయినవారి సంఖ్య చాలా ఎక్కువ అని పోలీసులు చెబుతున్నారు.

surrender of Maoists

సీఆర్‌పిఎఫ్‌, స్థానిక పోలీసులు గాలింపులు జరుపుతున్నా దొరకని అన్నలు ఇప్పుడు రూ.500, రూ.1000 నోట్లు ర‌ద్దు చేసిన త‌ర్వాత వరస పెట్టి లొంగిపోతున్నారు. ఛత్తీస్‌ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇందులో ఒక్క ఒడిశాలోని మల్కన్‌ గిరి జిల్లా నుంచే 70శాతం మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ బలగాల దాడిలో.. 23 మంది మావోయిస్టులు ఎన్‌ కౌంటర్‌కు గురి అయ్యారు. గత రికార్డులతో పోలీస్తే పెద్ద సంఖ్యలోనే మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిసింది. 2011 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం 3వేల 766మంది లొంగిపోయారు. వారిలో ఈ ఏడాదిలోనే వెయ్యి 399మంది లొంగిపోగా,…ఈ నవంబర్‌ నెలలోనే 564మంది లొంగిపోయారు.

surrender of Maoists

మావోయిస్టులు లొంగిపోతుండ‌డానికి అభివృద్ధి ఒక కార‌ణంగా కాగా, నోట్ల ర‌ద్దు మ‌రో కార‌ణ‌మని పోలీసు ఉన్నత అధికారులు చెబుతున్నారు. మావోయిస్టుల దగ్గర ర‌ద్ద‌యిన నోట్లు మార్చుకునే వీలు లేక‌పోవ‌డం, డ‌బ్బులు లేక‌పోవ‌డంతో నిత్యావ‌స‌రాలు తీర్చుకోలేక‌పోతుండ‌డంతో మ‌రో దారిలేక వారు లొంగిపోతున్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు. స్థానిక కాంట్రాక్ట‌ర్లు, వ్యాపార‌వేత్త‌లు, సానుభూతిప‌రుల సాయంతో పాత‌నోట్ల‌ను మార్చుకోవాల‌ని మావోయిస్టులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని డీజీ, ఐజీల కాన్ఫ‌రెన్స్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. నోట్ల ర‌ద్దుతో వారి ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని ఆయన పేర్కొన్నారు. నోట్ల ర‌ద్దుతో వారు పీక‌లోతు క‌ష్టాల్లో కూరుకుపోయార‌ని, వారితో క‌లిసి ఉండ‌డం వ‌ల్ల ఎటువంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని సానుభూతిప‌రులు న‌మ్ముతున్నార‌ని సీఆర్‌పీఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ దుర్గా ప్ర‌సాద్ పేర్కొన్నారు. నోట్ల ర‌ద్దుతో మావోయిస్టుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని, వేర్వేరు ప్రాంతాల‌కు త‌ర‌లిపోతున్నార‌న‌డంలో ఎటువంటి సందేహం లేద‌ని దుర్గా ప్రసాద్ వివ‌రించారు.

- Advertisement -