నీట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తమిళనాడు విద్యార్థిని అనిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అనిత.. తల్లిదండ్రులు లేకపోయినా అనేక కష్టాలకోర్చి ఇంటర్‌లో మంచి మార్కులు సాధించింది.
బోర్డు మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తే.. ఆమెకు సులువుగా మెడికల్ సీటు దక్కేది. డాక్టర్ కావాలన్న ఆమె ఆశలపై నీట్ నీళ్లు చల్లడంతో కుంగిపోయింది. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించినా.. ఆమెకు నిరాశే దక్కింది. ఎన్నో కష్టాలకోర్చి చదివినా కన్నీరే మిగలడంతో అనిత ఉరేసుకొని మరణించింది.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటనపై ఇప్పటికే విద్యార్థులతో పాటు పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ నీట్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా ప్రముఖ నటుడు సూర్య ట్విటర్ ద్వారా స్పందించారు. ‘అనిత విషయంలో జరిగిన దారుణం మళ్లీ జరగకూడదు. సమాజంలో మరో అనిత ఉండకూడదు.
ఇలాంటివి సమాజంలో జరగకుండా మన పిల్లల చదువు కోసం చేతులు కలుపుదాం’ అని ట్వీట్ చేశారు సూర్య. అనిత ఘటనపై ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, స్టాలిన్, కీర్తిసురేశ్ తదితరులు స్పందించారు.