టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. మహానటి సావిత్రి బయోపిక్ భారీ విజయాన్ని అందుకోవడంతో పలువురి బయోపిక్ లను తీసేందుకు సిద్దమవుతున్నారు దర్శక, నిర్మాతలు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా తెరకెక్కించనున్నారు హీరో బాలకృష్ణ. త్వరలోనే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈసందర్భంగా తెరపైకి ప్రముఖ నిర్మాత రామానాయుడు జీవిత కథ ఆధారంగా బయోపిక్ ను తీయనున్నట్లు వార్తలు వచ్చాయి.
తన తండ్రి బయోపిక్ వస్తున్న వార్తలపై స్పందించారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు. తన తండ్రి బయోపిక్ తీయడం అంటే రిస్క్ తో కూడుకున్న పని అన్నారు. బయోపిక్ తీయాలన్న ఆలోచన ఏమీ లేదన్నారు. మహానటి, సంజు వంటి బయోపిక్ లకు దీనికి మధ్య చాలా తేడా ఉందన్నారు. వాళ్లు తమ జీవితాలలో పలు కోణాలను ఎదుర్కొన్నారని తెలిపారు. కథలో కంటెంట్ లేకపోతే సినిమాను ఎవరూ చూడరన్నారు. ఇప్పటివరకూ ఆయన బయోపిక్ తీయాలన్న ఆలోచన లేదన్నారు. మా నాన్న బయోపిక్ తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అన్నారు నిర్మాత సురేష్ బాబు.
ఇక ప్రస్తుతం సురేష్ బాబు నిర్మాణ సంస్ధలో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఈనెల 29న విడుదల చేయననున్నారు. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇటివలే విడుదలైన ఈసినిమా టైటిల్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త వారిని ఎంకరేజ్ చేయడంతో సురేష్ ప్రొడక్షన్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. తరుణ్ భాస్కర్ ఈసినిమాను మా బ్యానర్ లో చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లి చూపులు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈసినిమా ఏ మేరకు విజయం సాధిస్తోందో చూడాలి.