బీజేపీ నేతలకు సురవరం సూటి ప్రశ్నలు

66
suravaram
- Advertisement -

సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానుండగా అన్నివర్గాల నుండి బీజేపీ నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ ఎంపీ సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి బీజేపీ నేతలకు పలు ప్రశ్నలు సందిస్తూ వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మీరు చెబుతున్న ప్ర‌కారం విముక్తి లేదా విమోచ‌న సాధించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ 1947లో నిజాంతో య‌థాత‌థ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఫ‌లితంగా ఆ త‌రువాత సంవ‌త్స‌ర కాలంలోనే ర‌జాకార్లు, భూస్వాముల దౌర్జ‌న్యాలు, అరాచ‌కాలు మ‌రింత పెరిగిపోలేదా? ఆ సంవ‌త్స‌ర కాలంలోనే గొలుసులు తెంచుకున్న న‌ర‌క‌లోక‌పు ర‌జాకార్ జాగీలాలు చీల్చి చెండాడ‌లేదా?

మీరు విమోచ‌న క‌లిగించాడ‌ని చెప్పుకునే ప‌టేల్ హైద‌రాబాద్ కు వ‌చ్చి ఎందుకు నిజాం ను అరెస్టు చేయ‌లేదు? ఎందుకు మ‌ళ్ళీ నిజాంకు రాజ‌ప్ర‌ముఖ్ గా ప‌ట్టాభిషేకం చేసి, సంవ‌త్స‌రానికి కోటి రూపాయ‌ల రాజభ‌ర‌ణం ఇచ్చారు? ఇది నిజాంకు లొంగుబాటు కాదా? అది ప్ర‌జ‌ల ర‌క్త‌మాంసాలు పీల్చి సంపాదించింది కాదా?

ఐదు సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్ళీ నిజాంను గ‌వ‌ర్న‌ర్‌గా ఉండాల‌ని కోరిన మాట వాస్త‌వం కాదా?

విలీనం త‌రువాత సైన్యం గ్రామాల మీద ప‌డి, ప్ర‌జ‌లు పంచుకున్న ప‌ది ల‌క్ష‌ల ఎక‌రాల భూముల‌ను తిరిగి భూస్వాముల‌కు అప్ప‌గించిన‌ది వాస్త‌వం కాదా?

ర‌జాకార్ల‌కంటే ఎక్కువగా ప్ర‌జ‌ల మీద దాడులు, మాన‌భంగాలు సాగించ‌లేదా? మూడు వేల మందిని చంపి, ప‌ది వేల మందిని గాయ‌ప‌రిచి భ‌యోత్పాతం సృష్టించ‌లేదా?

ఈ గ‌డ్డ మీద నాడు ఫ్యూడ‌లిజానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన పోరాటంలో పాల్గొన‌కుండా ఆర్‌ ఎస్ ఎస్ ఎందుకు నిశ్శ‌బ్దంగా ఉన్న‌ది? ఇప్పుడెందుకు రంకెలు వేస్తున్నారో చెప్ప‌గ‌ల‌రా?

నిజాం నిరంకుశ పాల‌న‌కు వెన్నుద‌న్నుగా నిలిచిన హిందూ భూస్వాములు, సంస్థానాధిప‌తులు, జాగీర్దారుల పాత్ర‌ను మీ స‌భ‌లో బ‌హిర్గ‌తం చేసి విమ‌ర్శించ‌గ‌ల‌రా?

భార‌త సైన్యంతో క‌మ్యూనిస్టులు యుద్ధం చేసార‌ని ప‌టేల్ విమ‌ర్శించిన త‌రువాత, వేలాది క‌మ్యూనిస్టుల‌ను చంపి, 12 మందికి ఉరిశిక్ష‌లు విధించి, వంద‌లాది మందికి సుదీర్ఘ శిక్ష‌లు వేసినప్ప‌టికి కూడా 1952లో జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో భార‌త‌దేశంలోఅంద‌రికంటే ఎక్కువ ఓట్లు ఆ క‌మ్యూనిస్టు నాయ‌కుల‌కే ఎందుకు వ‌చ్చాయో చెప్ప‌గ‌ల‌రా? ప్ర‌జ‌లు ప‌టేల్‌ను న‌మ్మారా? క‌మ్యూనిస్టుల‌ను న‌మ్మారా?

ఇది ఎవ‌రి నుండి ల‌భించిన విముక్తి?
తెలంగాణ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల స్ర్కీనింగ్ క‌మిటీ సిఫార్సు చేసిన స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌కు వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్ డి ఎ ప్ర‌భుత్వం పెన్ష‌న్‌ల‌ను నిరాక‌రించిన మాట‌ వాస్త‌వం కాదా?

- Advertisement -