గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిరక్షణకు కీలక చర్యలు!

6
- Advertisement -

గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (GIB) మరియు లెస్సర్ ఫ్లోరికన్ అనే అత్యంత ప్రమాదంలో ఉన్న పక్షి జాతుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ మౌలిక సదుపాయాలు, నివాస ప్రాంతాల నష్టం వల్ల అంతరించిపోతున్న ఈ పక్షులను రక్షించేందుకు నిపుణుల కమిటీ సూచించిన చర్యలను రెండేళ్లలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం, ఇది కేవలం ఒక పక్షి జాతి పరిరక్షణ విషయం మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణతో పాటు భారత్ చేపడుతున్న పునరుత్పాదక ఇంధన మార్పిడిని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఒకదానిని త్యాగం చేసి మరొకదాన్ని సాధించకూడదు అని స్పష్టం చేసింది.

నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాజస్థాన్‌లో 33 కేవీ విద్యుత్ లైన్లలో కీలకమైన 80 కిలోమీటర్లు, గుజరాత్‌లో 79 కిలోమీటర్ల లైన్లను భూగర్భంలో ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే పలు 66 కేవీ లైన్లను మళ్లించే చర్యలు చేపట్టాలని, కీలక పరిరక్షణ ప్రాంతాల్లో 2 మెగావాట్లకు పైగా సామర్థ్యం గల కొత్త విండ్ టర్బైన్లు, సోలార్ పార్కుల ఏర్పాటుపై పూర్తిస్థాయి నిషేధం విధించింది.

ఈ కేసు 2019లో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా వచ్చింది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా కనిపించిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్‌లలోని కొద్ది ప్రాంతాల్లో మాత్రమే మిగిలి ఉండగా, మొత్తం సంఖ్య 250కంటే తక్కువగా ఉందని కోర్టు గుర్తించింది. 2021లో రాజస్థాన్, గుజరాత్‌లలో సుమారు 99 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఓవర్‌హెడ్ ట్రాన్స్‌మిషన్ లైన్లపై నిషేధం విధించిన కోర్టు, తరువాత కేంద్రం అభ్యర్థన మేరకు ఆదేశాలను పునఃసమీక్షించింది. పునరుత్పాదక ఇంధన రంగం, వాతావరణ లక్ష్యాలు, శక్తి భద్రతలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ రాజస్థాన్‌లో 14,013 చదరపు కిలోమీటర్లు, గుజరాత్‌లో 740 చదరపు కిలోమీటర్లను ప్రాధాన్యత పరిరక్షణ ప్రాంతాలుగా గుర్తించి తక్షణ చర్యలు సూచించింది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుర్తించిన 250 కిలోమీటర్ల హైరిస్క్ విద్యుత్ లైన్లను రెండేళ్లలో భూగర్భంలో ఏర్పాటు చేయాలని కోర్టు ఆమోదించింది.

పక్షుల ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించేందుకు కీలక నివాస ప్రాంతాలకు బయట “పవర్ కారిడార్లు” ఏర్పాటు చేయాలని సూచించింది. కార్పొరేట్ సంస్థలు పర్యావరణ పరిరక్షణను తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలని, ఇది దాతృత్వం కాదని, రాజ్యాంగ ఆర్టికల్ 51A(g) ప్రకారం బాధ్యత అని కోర్టు వ్యాఖ్యానించింది.

Also Read:శ్రీశైలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

- Advertisement -