ఉత్తరప్రదేశ్‌లో 2009లో జరిగిన ఒక వికలాంగుడి అనుమానాస్పద కస్టోడియల్ డెత్ (పోలీస్ లాకప్‌లో మరణం) కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టులో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పిల్ (PIL) తదుపరి విచారణలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కనిపించకుండా పోయిన వీడియో ఆధారాలను రికవరీ చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని ఆదేశిస్తూ స్వయంగా న్యాయవ్యవస్థపై మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)పై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు మైన్‌పురి మాజీ ఎస్ఎస్పీ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ రేంజ్ ఐజీ) అజయ్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన అప్పీళ్లపై నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని తాము పరిశీలించే వరకు హైకోర్టులో ఉన్న పిల్ తదుపరి విచారణలపై స్టే విధిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వారం ప్రారంభంలో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది, సీనియర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ శరణ్ దేవ్ సింగ్ ఠాకూర్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడమే కాకుండా, రాష్ట్ర పోలీసులపై, స్వయంగా అలహాబాద్ హైకోర్టుపై మరియు NHRC లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని, దీనిపై సుప్రీంకోర్టు సమీక్ష అవసరమని కోరారు. దాంతో సుప్రీంకోర్టు ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు అంగీకరిస్తూ హైకోర్టు విచారణను నిలిపివేసింది.
మహిళలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పనిచేసే ‘అసోసియేషన్ ఫర్ అడ్వకేసీ అండ్ లీగల్ ఇనిషియేటివ్స్’ (AALI) అనే సంస్థ 2010లో ఈ పిల్ దాఖలు చేసింది. 2009 మే 9న మైన్‌పురిలోని దానహర్ పోలీస్ స్టేషన్ లాకప్‌లో 40 శాతం శారీరక వికలాంగత్వం కలిగిన ఒక వ్యక్తి మరణించాడు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆ సంస్థ కోరింది.
పోలీసుల అధికారిక వర్షన్ ప్రకారం.. సదరు వ్యక్తి లాకప్‌లోని యూరినల్ భాగంలో తన బెల్ట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మే 18న ఇచ్చిన ఉత్తర్వుల్లో అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం (న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, సిద్ధార్థ్ నందన్) పోలీసుల కథనంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. నిరంతర నిఘా ఉండే పోలీస్ లాకప్‌లో, 40 శాతం శారీరక వికలాంగత్వం ఉన్న వ్యక్తి ఎవరికీ తెలియకుండా ఉరివేసుకోవడం “అసాధ్యం” అని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసును వ్యవస్థాగత వైఫల్యాలకు అద్దం పట్టేది”గా పేర్కొన్న హైకోర్టు.. పిల్ దాఖలై దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నా, ఘటనా స్థలానికి సంబంధించిన వీడియోలు, ఫోటోగ్రాఫ్‌లు మరియు పోస్ట్‌మార్టం రికార్డింగులను కోర్టు ముందు హాజరుపరచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత సుదీర్ఘ ఆలస్యం వల్ల కీలకమైన ఆధారాలు మాయమయ్యే ప్రమాదం ఉందంది.
మూడు వ్యవస్థలపై హైకోర్టు తీవ్ర విమర్శలు:
స్వయంగా న్యాయవ్యవస్థ (హైకోర్టు): కస్టోడియల్ డెత్ వంటి తీవ్రమైన కేసును ఆధారాలు మాయం కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ మూడు నెలల్లోనే ముగించాల్సింది పోయి 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంచడంపై హైకోర్టు తనను తాను తప్పుపట్టుకుంది.
కోర్టు ఆదేశించినప్పటికీ వీడియో ఆధారాలు ఎందుకు మాయమయ్యాయో పోలీసులు సరైన వివరణ ఇవ్వలేకపోయారని, వారు నెపాన్ని NHRC పైకి నెడుతున్నారని కోర్టు పేర్కొంది. రికార్డింగులను సమర్పించకపోవడం చూస్తుంటే నేరాన్ని దాచే ప్రయత్నంగానే కనిపిస్తోందని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం నివేదికలో మెడ వెనుక భాగంలో ముడి గుర్తులు, శ్వాసనాళ వలయాలు విరిగిపోవడం వంటివి ఉన్నాయని, ఇది బెల్ట్‌తో ఉరివేసుకోవడం కంటే గొంతు నులిమి చంపినట్లు సూచిస్తోందని పేర్కొంది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC): 2011లోనే పోలీసుల నివేదికను యథాతథంగా అంగీకరించి ఈ ఫిర్యాదును ముగించడంపై NHRC ని కోర్టు నిలదీసింది. కమిషన్ ఎలాంటి స్వతంత్ర దర్యాప్తు చేయలేదని, కీలక సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయకుండా పోలీసుల నివేదికను “పరమ సత్యం”గా నమ్మిందని విమర్శించింది. కస్టోడియల్ డెత్ ఫిర్యాదులను ఇలాగే ముగించేటట్లయితే అసలు ఆ వ్యవస్థ (NHRC) ఆశయం ఏంటని ప్రశ్నించింది.
Also Read:అంబటిపై గల్లా పరువునష్టం దావా!
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఘజియాబాద్‌లోని సీబీఐ యాంటీ కరప్షన్ బ్రాంచ్‌ను రంగంలోకి దించిన హైకోర్టు.. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే ఆ మాయమైన వీడియో రికార్డింగులను 60 రోజుల్లోగా రికవరీ చేసి కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది.

