శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు సీజే ఠాకూర్‌

239
- Advertisement -

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌.ఠాకూర్‌ గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిఎస్‌.ఠాకూర్‌కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి డి.సాంబశివరావు, తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన కొప్పెర హుండీలో ప్రధాన న్యాయమూర్తి కానుకలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం అదనంగా హుండీని ఏర్పాటుచేసినట్టు తితిదే ఈవో వారికి వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, 2017వ సంవత్సరం క్యాలెండర్‌, డైరీని అందజేశారు.

unnamed

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌.ఠాకూర్‌ మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న సామాన్యభక్తులకు పెద్దపీట వేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకదృష్టి సారించారని తెలిసిందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని తితిదేని అభినందించారు. దేశప్రజలు సుభిక్షంగా ఉండాలని, శాంతిసౌఖ్యాలు వెల్లివిరియాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్రీ ఎన్‌వి.రమణ, జిల్లా కలెక్టర్ శ్రీ సిద్దార్థ్ జైన్, సబ్ కలెక్టర్ శ్రీ హిమాన్షుశుక్ల, సివిఎస్ఒ శ్రీ శ్రీనివాస్, అర్బన్ ఎస్పి శ్రీ జయలక్ష్మి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణయాదవ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు

- Advertisement -