ఛేదనలో పుణె పది పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుని ఓటమి అంచున చిక్కుకున్న వేళ.. 14.5 కోట్ల రూపాయలకు అమ్ముడైన స్టోక్స్ అద్వితీయ పోరాటంతో తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో పుణెకు ఇది ఐదో విజయం. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణేకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే రహానె (4), స్టీవ్ స్మిత్ (4)ని ఔట్ చేసి ఆ జట్టును సాంగ్వాన్ గట్టి దెబ్బతీశాడు. తర్వాతి ఓవర్లో తివారి (0) రనౌట్ కావడంతో 10/3తో నిలిచిన పుణెకు గెలుపు చాలా కష్టమే అనిపించింది. ఆ తరువత వచ్చిన స్టోక్స్ భారీ షాట్లు బాదేస్తూ, చకచకా సింగిల్స్ తీస్తూ జట్టును ఆదుకున్నాడు. రన్‌రేట్ చేయి దాటకుండా జాగ్రత్తపడ్డాడు. వీలు కుదిరినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ 63 బంతులు ఆడిన బెన్ స్టోక్స్…7 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయం అందించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ గుజరాత్‌కు మంచి ఆరంభమే లభించింది. బ్రెండన్ మెక్‌కలమ్, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. పవర్‌ప్లే ఆఖరి బంతికి ఇషాన్ ఔటయ్యేటప్పటికి స్కోరు 55. ఇషాన్‌ను తాహిర్ ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో ఐదు పరుగులే ఇచ్చిన తాహిర్, ఆ తర్వాతి ఓవర్లో ఫించ్ (13), డ్వేన్ స్మిత్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేసి గుజరాత్‌ను గట్టిదెబ్బ తీశాడు. అంతకుముందే రైనా (8) కూడా రనౌటవడంతో పది ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 94/4తో నిలిచింది. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న గుజరాత్ మిగతా పది ఓవర్లలో పేలవంగా బ్యాటింగ్ చేసింది. మెక్‌కలమ్‌ను 12వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ ఔట్ చేశాక పరుగుల వేగం బాగా తగ్గిపోయింది. దినేశ్ కార్తీక్ (29; 26 బంతుల్లో 3×4), జడేజా (19; 12 బంతుల్లో 3×4) కాస్త రాణించడంతో గుజరాత్ 160 దాటగలిగింది. చివరి ఐదు ఓవర్లలో 26 పరుగులే చేసిన గుజరాత్ నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఇందులో మూడు ఉనద్కతే పడగొట్టాడు.