ఇటీవల హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాల వెల్లువ మొదలైంది. ప‌్రస్తుతం మన ఫిలింమేకర్స్ చరిత్ర నేపథ్యంలో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హిస్టరీ బేస్ చేసుకుని ఇటీవల ఓ రెండు భారీ క్రేజీ చిత్రాలు తెలుగులో రిలీజై చక్కని విజయం సాధించాయి. ఇప్పుడు ఈ కోవలోనే హిస్టరీ బేస్ చేసుకుని మరో ఆసక్తికర చిత్రం టాలీవుడ్‌లో తెరకెక్కుతోంది. కథ, కాన్సెప్ట్ ప్రధానంగా చరిత్రను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న తాజా చిత్రం `సువర్ణ సుందరి`. `చరిత్ర ఎప్పుడూ భవిష్యత్‌ని వెంటాడుతుంది` అనేది ట్యాగ్‌లైన్. ఎస్.టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్ లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంచ్ చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చింది.
ఈ సందర్భంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ -”ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. 1509 సంవత్సరం చరిత్రలో ప్రారంభమై, నేటి(2017) వరకూ.. నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ ఇది. కాలాదుల్ని బట్టి వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. బీదర్, కేరళ, కాలక్కల్, అనంతపూర్, హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల చిత్రీకరణ చేశాం. ట్రోలర్ కాస్టర్స్ స్క్రీన్‌ప్లేలో కథ ఉంటుంది. చరిత్ర ఎప్పుడూ విజయాల గురించి చెబుతుంది. అయితే చరిత్రలో బయటికి తెలియని చీకటి కోణాలుంటాయి. అలాంటి ఓ చీకటి కోణం ఇప్పటి వరకూ రకరకాల జనరేషన్లపై ఎలాంటి ప్రభావం చూపించింది అన్నదే కథాంశం. ఈ సినిమాలో నాటి- నేటి జనరేషన్ గ్యాప్ చూపించేందుకు చాలానే జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి సెట్‌కి సీజీ చేస్తున్నాం. హైదరాబాద్, పూణే, ముంబైలలో సీజీవర్క్ జరుగుతోంది. హై క్వాలిటీ విజువల్స్ చేస్తున్నాం. దాదాపుగా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి, సినిమా రిలీజ్ చేస్తాం” అని తెలిపారు.
పూర్ణ, సాక్షి చౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్లుమహంతి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ప‌్రవీణ్ పూడి,దర్శకత్వం: సూర్య.