హోం గ్రౌండ్స్‌లో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సన్ రైజర్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో పదకొండో నెంబర్ బ్యాట్స్‌మెన్ బిల్లీ స్టాన్లేక్ ఆఖరి బంతికి బౌండరీ కొట్టి విజయాన్ని అందించాడు.
148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ చిన్న లక్ష్యమే అయినప్పటికి చెమటొడ్చక తప్పలేదు. ఓపెనర్లు ధావన్ (28 బంతుల్లో 45), సాహా(22) చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే మ్యాజిక్ చేశాడు. మార్కండే 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ మాయాజాలంతో సన్‌రైజర్స్ 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కానీ విజయానికి మరో 12 పరుగులు అవసరమైన దశలో బుమ్రా వరుస బంతుల్లో పఠాన్ (14), రషీద్ ఖాన్‌లను ఔట్ చేశాడు. ముస్తాఫిజుర్ కూడా రెండు వికెట్లు తీయడంతో సన్‌రైజర్స్ ఓటమి తప్పదనిపించింది. కానీ ఒకే ఒక వికెట్ చేతిలో ఉండగా 2 బంతుల్లో 2 పరుగులు …నరాలు తెగే ఉత్కంఠ… వికెట్ పడితే ముంబయిదే విజయం. ఒక్క పరుగు చేసినా సూపర్ ఓవర్. కానీ స్టాన్‌లేక్ బాదిన బౌండరీతో సన్‌రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో విజయం నమోదైంది.
అంతకముందు బ్యాటింగ్ చేసిన ముంబై తడబాటు పడింది. పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. రోహిత్‌శర్మ (11) విఫలమయ్యాడు. లూయిస్ (29), పొలార్డ్ (28; 23 బంతుల్లో 3×4, 2×6), సూర్యకుమార్ (28; 31 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో ముంబయి నిర్ణీత ఓవర్లలో 147 పరుగులు చేసింది.