ఐపీఎల్ 2020లో భాగంగా కీలకమ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉండటంతో చావోరేవో తేల్చుకోవాల్సిన హైదరాబాద్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ముంబై విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 151 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 10 ఫోర్లు,ఒక సిక్స్ సాయంతో 85 పరుగులు చేయగా వృద్దిమాన్ సాహా 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 58 పరుగులు చేసి హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఐపీఎల్ 2020లో భాగంగా లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. హైదరాబాద్ బౌలర్లు రాణించడంతో ముంబై టాప్ ఆర్డర్ విఫలమైంది. పొలార్డ్(41: 25 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లకు తోడు క్వింటన్ డికాక్(25), సూర్యకుమార్ యాదవ్(36), ఇషాన్ కిషన్(33) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది.
హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ(3/34), జేసన్ హోల్డర్(2/25), షాబాజ్ నదీం(2/19) రాణించారు. కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు రాణించడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది.