ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఓ వైపు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి మరోవైపు సీనియర్ నేతలు బీజేపీలోకి వలసబాట పట్టేందుకు సిద్ధమవుతుండటంతో హస్తం నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఎంపీ టీకెట్ ఆశీంచి భంగపడ్డ సీనియర్ నేతలకు గాళం వేస్తున్నారు కషాయ నేతలు.
ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరగా ఆమె బాటలోనే పయనించేందుకు సీనియర్ నేతలు సిద్ధమయ్యారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో బీజేపీ నేతలు భేటీ అయి పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. మెదక్ ఎంపీ సీటు ఆశించిన సునీతా లక్ష్మారెడ్డి వేరేవారికి టికెట్ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీలో చేర్చుకుని మెదక్ అభ్యర్థిగా బరిలో దించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
సుమారు 20మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారట. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ బారిన పడకుండా ఉన్న నాయకుల్ని కాపాడుకునే పనిలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో జానాకు స్వయంగా రాహుల్ ఫోన్ చేసి తొందరపడవద్దని సూచించడంతో వెనక్కి తగ్గారని తెలుస్తోంది. మొత్తంగా ఆపరేషన్ ఆకర్ష్‌తో హస్తం నేతల కంటిమీద కునుకు లేకుండా పోయింది.