ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప
. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే చిత్రంలో సునీల్ పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో అతడు మంగళం శ్రీను అనే పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి సునీల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ మూవీలో మునుపెన్నడూ లేని విధంగా బట్టతలతో, భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చాడు సునీల్. మంగళం శ్రీనుగా అతడు ఏ మేరకు దుమ్ము రేపుతాడో తెరపై చూడాల్సిందే. దాని కోసం డిసెంబర్ 17 థియేట్రికల్ రిలీజ్ వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. పుష్ప చిత్రాన్ని తెలుగు-తమిళం-హిందీ సహా అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజులో విడుదల చేయనున్నారు.