తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.
ప్రపంచ నలుమూలలకు చెందిన కోట్లాది మంది భక్తులు కల్తీ లడ్డూ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరుడి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని భక్తులు జీర్ణించుకోవడం కష్టంగా మారింది. దీనికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కోరుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాల్సిందిగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ… తిరుమల ప్రసాదం లడ్డూపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఇదిలాఉంటే.. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరపనుంది.
Also Read:KTR:సింగరేణి బోనస్ అంతా బోగస్