పానీ పూరీ.. హానీ పూరీ

362
study-finds-bacteria-pani-puri
- Advertisement -

పానీ పూరీ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్లదాకా సాయంత్రం సమయంలో రోడ్డు పక్కన బండిపై కనిపించే పానీ పూరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అయితే ఇక నుంచి అలాంటి చోట్ల పానీ పూరీ తినడం మానేయాలని వైద్య విధ్యార్థులు సూచిస్తున్నారు. పానీపూరీపై హైదరాబాదు, గాంధీ మెడికల్ కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్(సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్) నిర్వహించిన అధ్యయనంలో మురుగు నాలాల పక్కన తోపుడు బళ్లపై ఉంచి విక్రయించే ఆహారం మరింత ప్రమాదకరమని తేలింది.

నగరంలో వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించారు. నాలాకు రెండు మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల నుంచి సేకరించిన పానీపూరి ఇతర ఆహారంలో 48.2 శాతం కలుషితమైనట్లు గురించారు. అదే 2 మీటర్ల కంటే దాటిన దుకాణాల నుంచి సేకరించిన శాంపిళ్లలో 28.6 శాతం వరకు బ్యాక్టీరియా కలుషితాలు ఉన్నట్లు తేలింది. వీటిని తినడంతో ప్రమాదకరమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. కాస్త శుభ్రత పాటించిన దుకాణాల నుంచి సేకరించిన వాటిలో కలుషితాలు తక్కువగా ఉన్నాయి. ఇక ప్రతి తోపుడు బండి వద్ద చెత్తను వేయడానికి డబ్బా ఉంచుతున్నారు. అందులో చెత్తను వేస్తున్నారు. ఇందులోంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయి తిరిగి అవి ఆహార పదార్థాలపై చేరుతున్నాయి.

pan

ప్లేట్లు సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల 60 శాతం శాంపిళ్లలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు.. ప్రధానంగా ప్లేట్లు, గ్లాసులను కడిగే క్రమంలో అవన్నీ ఓ టబ్బులో వేసి అందులో ఉన్న నీటితోనే కడగడం లేదా ప్రత్యేక ట్యాప్‌ ద్వారా కడగడాన్ని పరిశీలించారు. అలాగే తినే చోటుకు, ప్లేట్లు కడిగే చోటుకు ఉన్న దూరాన్ని తద్వారా వ్యాపించే బ్యాక్టీరియాను సేకరించి పరీక్షలకు పంపించారు. చేతులకు గ్లౌజులు ధరించి పదార్థాలను అందిస్తున్న దుకాణాల వద్ద అంతగా బ్యాక్టీరియా లేనట్లు తేలింది. జీవనోపాధికి వ్యాపారం చేయడం తప్పు కాదు. జీవన గమనాన్ని కొనసాగించడానికి అది అవసరం కూడా. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై బాధ్యతగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పానీ పూరీతోపాటు పండ్ల రసాలు, సమోసాలపైనా పరీక్షలు జరిపారు. సమోసాలు వేడిగా ఇస్తుండడంతో ఇందులో బ్యాక్టీరియా ఉండడం లేదని తేలింది. మిగతా పదార్థాల్లో మాత్రం ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని ఏపీఎం విభాగ హెడ్ విమలాథామస్, అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్మయి, విద్యార్థులు తెలిపారు. జంట నగరాల్లోని 80 ప్రాంతాల్లో ఐదు నెలలపాటు పర్యటించి, నమూనాలు సేకరించినట్టు పేర్కొన్నారు. సమోసా మినహా మిగతా వాటిలో 54 శాతం శాంపిళ్లు రోగాలకు కారణమవుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వాటిలో ప్రమాదకర ఈకోలి, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా అంచనాలకు మించి ఉందని వివరించారు. ఈకోలి కారణంగా వాంతులు విరేచనాలు అవుతాయని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగా సాల్మొనెల్లాతో టైఫాయిడ్ జ్వరం వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై బాధ్యతగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -