ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ షాకిచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో గెలిచి ముంబై విజయ పరంపరకు బ్రేకేసింది. ఆరు విజయాల తర్వాత ముంబైకి ఇది తొలి ఓటమి కావడం గమనార్హం. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా, ఆరంభంలో ఓపెనర్లు బ్యాట్ ఝుళిపించినా ముంబయి ఛేదన అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఓపెనర్లు పార్థివ్, బట్లర్ చకచకా బౌండరీలు బాదడంతో తొలి నాలుగు ఓవర్లలో ముంబయి వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. ఐతే ఐదో ఓవర్లో బట్లర్ (17; 13 బంతుల్లో 3×4)ను ఔట్ చేయడం ద్వారా ముంబయిని స్టోక్స్ తొలి దెబ్బతీశాడు. ఫామ్‌లో ఉన్న రాణా (3)ను క్రిస్టియన్ ఎక్కువసేపు నిలువనివ్వలేదు. ఇక పార్థివ్ (33; 27 బంతుల్లో 4×4)ను సుందర్ ఔట్ చేసే సమయానికి ముంబయి 60/3తో నిలిచింది.17వ ఓవర్ తొలి బంతికి పొలార్డ్ (9)ను తాహిర్ ఔట్ చేయడంతో పుణె మ్యాచ్‌లోకి వచ్చింది. క్రమంగా ఒత్తిడి పెంచింది. ఆ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి.
18వ ఓవర్లో (ఉనద్కత్) రోహిత్ రెండు ఫోర్లు కొట్టడంతో చివరి రెండు ఓవర్లలో ముంబయికి 24 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్లో స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చి ముంబయిపై ఒత్తిడి పెంచాడు. చివరి ఓవర్లో ముంబయికి 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి ఉనద్కత్.. హార్దిక్(13)ను ఔట్ చేశాడు. రెండో బంతికి రోహిత్ సిక్స్ కొట్టి ముంబయిని రేసులో నిలిపాడు. ఐతే మూడో బంతికి రోహిత్ ఆఫ్‌వికెట్ వైపు జరగ్గా.. ఉనద్కత్ బంతిని బాగా ఎడంగా వేశాడు. రోహిత్ వైడ్ అని భావించగా.. అంపైర్ అలాంటి సంజ్ఞ ఏమీ చేయలేదు. దీంతో రోహిత్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కొంత అలజడికి గురైన రోహిత్.. తర్వాతి బంతికి షాట్ ఆడబోయి బంతిని అక్కడే గాల్లోకి లేపాడు. ఉనద్కత్ క్యాచ్ అందుకోవడంతో ముంబయి ఆశలకు తెరపడింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణె.. ఓపెనర్లు రహానె (38; 32 బంతుల్లో 5×4, 1×6), రాహుల్ త్రిపాఠి రాణించడంతో 9 ఓవర్లలో 74/0తో బలంగా నిలిచింది. ఓపెనర్లు నిష్క్రమించాక పుణె ఇన్నింగ్స్ గతి తప్పింది. ఇన్నింగ్స్ గేర్ మార్చాల్సిన దశలో చకచకా వికెట్లు చేజార్చుకుని భారీ స్కోరుకు దూరమైంది. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లే వెనుదిరిగారు. స్మిత్ (17), స్టోక్స్ (17), ధోని (7) పెద్దగా స్కోరు చేయకుడానే నిష్క్రమించారు. షాట్లు ఆడేందుకు తిప్పలు పడ్డ ధోని.. ఆడిన 11 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. చివరికి బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆఖర్లో మనోజ్ తివారి (22; 13 బంతుల్లో 4×4) కాస్త మెరవడంతో స్కోరు 160 పరుగులకు చేరుకుంది. బౌలింగ్‌లో రాణించి జట్టువిజయంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.