ఇవి కేవలం కర్ణాటక ఎన్నికలు కాదు. దేశ గమనాన్ని నిర్ణయించే ఎన్నికలు. అందుకే దేశమంతటా అంత ఆసక్తి నెలకొంది. మొన్న 12న జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో పరుగులు పెడుతున్నాయి.
ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను చూస్తుంటే భాజపా విజయం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. ఈ ప్రభావం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో సూచీలు సరికొత్త శిఖరాలకు ఎగురుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. నిఫ్టీ 11వేల మైలురాయికి చేరువవుతోంది. ఉదయం 10.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 407 పాయింట్లు ఎగబాకి 35,964 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 10,923 వద్ద ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కదులుతున్నాయి.
కన్నడ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఈ ఉదయం కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా.. ఆ తర్వాత భాజపా ఆధిక్యంలోకి వెళ్లింది. భాజపా సొంతంగా 100కు పైగా స్థానాల్లో గెలుపొందే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే దేశీయ మార్కెట్లు భారీ లాభాలు సాధించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అతిపెద్ద పార్టీగా విజయపతాకం ఎగురవేసిన బీజేపీ కర్ణాటకలో సర్కారు ఏర్పాటు చేయనుంది.