రోజుకో వార్తతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో జనవరి 9న కథానాయకుడు,రాజకీయ నేపథ్యంలో జనవరి 24న మహానాయకుడు ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇప్పటికే బాలయ్య-రకుల్ మధ్య వేటగాడు సినిమాలో ఆకుచాటు పిందే తడిచే సాంగ్‌ను తెరకెక్కించగా తాజాగా ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలోని ‘చిత్రం భళారే విచిత్రం’ అనే పాటను బాలయ్య, శ్రియ జంటపై చిత్రీకరించారు. ఈ రెండు పాటలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది.
ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న పాత్రలను రివీల్ చేస్తూ అందరిని ఆకర్షించింది చిత్రయూనిట్. అంతేగాదు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యేకంగా తయారు చేయించిన చైతన్య రథంతో రాష్ట్రమంతటా పర్యటించారు. ఎన్టీఆర్ ప్రచార రథానికి సారధిగా హరికృష్ణ వ్యవహరించగా మహానాయకుడు సినిమాలో కళ్యాణ్ రామ్ సారథిగా కనిపించనున్నారు.
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా , ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నారు.