నందమూరి బాలకృష్ణకు “డిక్టేటర్” వంటి డీసెంట్ హిట్ ను అందించిన డైరెక్టర్ శ్రీవాస్ తన తదుపరి చిత్రాన్ని నేడు ప్రారంభించారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా” చిత్రంతో తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న నిర్మాణ సంస్థ మేఘన ఆర్ట్స్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 6వ చిత్రాన్ని నిర్మించనున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందనున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) ప్రతినాయక పాత్రలు పోషించనున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ చేయని ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మే 21) హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా.. రాఘవ లారెన్స్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బోయపాటి శ్రీను తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సురేష్, మిర్యాల రవీందర్ రెడ్డి,గోపీమోహన్, నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వర్రావు, ఎం.ఎస్.రాజు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. “”డిక్టేటర్” అనంతరం నా దర్శకత్వంలో తెరకెక్కనున్న 6వ చిత్రమిది. ఒక డిఫరెంట్ జోనర్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయనున్నాను. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా.. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. సాయిమాధవ్ బుర్రా గారు ఈ చిత్రానికి మాటలు రాయనున్నారు. రెగ్యులర్ షెడ్యూల్ ను హైద్రాబాద్ లో త్వరలో ప్రారంభించనున్నాం. ఆ తర్వాత ఒక మేజర్ షెడ్యూల్ ను ఫారిన్ లో ప్లాన్ చేస్తున్నాం. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తాం. ఈ చిత్రంలో జగపతి బాబు ప్రతినాయక పాత్ర పోషిచనున్నారు. ఇప్పటివరకూ ఆయన చేయని వైవిద్యమైన పాత్రలో కనిపించనున్నారు” అన్నారు.
ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: మేఘన ఆర్ట్స్, రచన-దర్శకత్వం: శ్రీవాస్!