శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దగల శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలను తిరుమల శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వీటిని గరుడసేవలో స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు.
శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం.
Also Read:శర్వాకు జోడిగా కృతి శెట్టి..