అతిలోక సుందరీని కడసారి చూసేందుకు సినీ,రాజకీయ,అభిమానులు ముంబైకి తరలివచ్చారు. సెలబ్రేషన్ క్లబ్ లో శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా విలక్షణ నటుడు కమలహాసన్, వెంకటేష్, జయప్రద,చిరంజీవి, ఐశ్వర్యారాయ్, అనిల్ కపూర్, సంజీవ్ కపూర్, సోనమ్ కపూర్, ఊర్వశి రౌతెలా, ఆదిత్య ఠాక్రే, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, ఫరా ఖాన్, అను కపూర్, హేమమాలిని, ఇషా డియోల్, హర్షవర్ధన్ కపూర్, సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, అక్షయ్ ఖన్నా, రితేశ్ దేశ్‌ముఖ్, సుస్మితాసేన్ తదితరులు శ్రీదేవికి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు.
ఇక శ్రీదేవి అంతిమ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచుతారు. 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో విలే పార్లే సేవా సమాజ్ హిందూ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
శ్రీదేవి ఇంటి పరిసరాలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు పెద్దఎత్తున తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అత్యంత భావోద్వేగ సమయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ భర్త బోనీకపూర్, కుమార్తెలు ఖుషి, జాహ్నవితోపాటు కపూర్, అయ్యప్పన్ కుటుంబ సభ్యులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.