శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అంతరాలయంలో రామయ్య దర్శనానికి సుమారు 4, 5 గంటల సమయం పడుతోంది. స్వామివారి కళ్యాణోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సీతారామ కళ్యాణ క్రతువు ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కల్యాణోత్సవం జరుగనుంది. స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు.
జగదానందకారకుడైన శ్రీరాముడు ముల్లోకాలనూ మురిపిస్తూ పెళ్లి కొడుకయ్యాడు. సీతమ్మ మెడలో మూడుముళ్లూ వేసి దాంపత్య బంధానికి దైవత్వాన్ని ఆపాదించనున్నాడు. కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రం భూలోక స్వర్గమై సాక్షాత్కరించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సుప్రభాతం పలికి, ఆరాధన నిర్వహించి, మంగళాశాసనం చేశారు. మూలమూర్తుల వైభవాన్ని అభిషేక మహోత్సవం మరింత పెంచింది. వేద పారాయణాలతో అంతా రామమయమై సాక్షాత్కరించింది.
మంత్రోచ్ఛరణల మధ్య మేళతాళలతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధన చేశారు. రాత్రి 7 గంటల నుంచి జరిగిన ఎదుర్కోలు ఉత్సవం అంబరాన్ని తాకింది. సోమవారం కల్యాణ మహోత్సవం జరగనుంది. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ జరిపి తిరువారాధన నిర్వహించాక ఉదయం 4 నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషేకం చేస్తారు. 8 నుంచి 9 వరకు ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించనున్నారు. ఇది సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగే వేడుక. ఆ తర్వాత కల్యాణమూర్తులకు అలంకారం చేసి ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకువెళ్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సీతారామ కల్యాణోత్సవం జరుగుతుందని ఈవో ప్రభాకర శ్రీనివాస్ తెలిపారు.
ఈ వేడుకకు సంప్రదాయబద్ధంగా ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను పట్టు వస్త్రాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, తుమ్మల నాగేశ్వరావు సమర్పించారు . భక్తులు, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం కల్యాణ మండపంలోని ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించారు. సెక్టార్‌లో 35 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు జరిగాయి. వేసవి వల్ల ఉక్క పోత సమస్యను తగ్గించేందుకు 40 టన్నులకు పైగా ఏసీని 40 కూలర్లను 200 ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో జీవించేలా సీతారామచంద్రస్వామి దీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సీతారాముల వివాహ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు.