మహేశ్ బాబు నటించిన `స్పైడర్` మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ. 100 కోట్ల వసూలు మార్కును దాటేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా గురించి నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కలెక్షన్లలో మాత్రం దూసుకెళ్తూనే ఉంది. అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా బాగానే వసూళ్లు రాబడుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజే రూ. 41.50 కోట్లు వసూలు చేసి అత్యధికంగా వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 52 కోట్లు, తమిళనాడు, కర్ణాటకల్లో రూ. 33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16 కోట్ల వరకు వసూలు చేసిందని సినీ నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు స్పష్టం చేశారు. దీంతో మొదటి వారాంతంలో వంద కోట్ల మార్కు దాటిన ఐదో సినిమాగా `స్పైడర్` రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు బాహుబలి 2, ఖైదీ నెం. 150, దువ్వాడ జగన్నాథం, జై లవ కుశ సినిమాలు ఈ రికార్డు సాధించాయి. మరోపక్క ఈ సినిమాను రూ. 157 కోట్లతో కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు కేవలం 70 శాతం మాత్రమే చేతికి వచ్చాయి. ఈ రకంగా చూస్తే `స్పైడర్` నిరాశపరిచిందనే చెప్పొచ్చు.