కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు ,మహిళలు పెద్ద సంఖ్యలో నాగులకట్ట వద్ద కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకున్నారు. వేకువజామున నుంచే భక్తులు పాతాళగంగలో కార్తీక స్నానాలచరించి గంగమ్మకు మొక్కలు తీర్చుకున్నారు.
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసాన్ని పురస్కరించుకొని భక్తులు కార్తీక దీపారాధనలు, అభిషేకం, అర్చనలతో ఆరాధిస్తున్నారు. శ్రీశైలం మల్లన్న సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోయింది.
కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకొని ఇప్పటికే ఏర్పాట్లపై చర్యలు మొదలు పెట్టినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు. ఆలయ మాడవీధుల్లో చలువపందిళ్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశామని… క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు సరఫరా చేస్తున్నట్లు ఈవో తెలిపారు. రద్దీ రోజుల్లో ఆలయ వేళల్లో మార్పులు చేశారు. రద్దీ రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి, మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, మహామంగళహారతి అనంతరం 4 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు .