సప్తగిరులపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు. తిరువేంకటనాథుని దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఒకేరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు.. అందులో చంటిబిడ్డల తల్లితండ్రులు, వృద్దులు, దివ్యాంగులు కూడా ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకొని శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయిస్తున్నది టీటీడీ. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సింఘాల్ తెలిపారు. నెలలో రెండు రోజుల పాటు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకూ చిన్న పిల్లల తల్లిదండ్రులను ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఏడాదిలోపున్న చంటిబిడ్డల తల్లితండ్రులకు రోజూ ప్రత్యేక దర్శన అవకాశం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ఈ నెల 15, 25 తేదీల్లో రోజుకు 4 వేల మందికి దర్శన అవకాశాన్ని కల్పించనున్నట్టు సింఘాల్ పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అక్టోబరు నెలకు సంబంధించి శ్రీవారి సేవా టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ వెల్లడించింది. అన్ని సేవలకు కలిపి మొత్తం 56,295 సేవా టికెట్లను విడుదల చేశామని, వీటిలో 12,495 సేవా టిక్కెట్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి కేటాయిస్తామని తెలిపింది.స్వామివారిని సేవలో పాల్గొనాలకునే భక్తులు ఆన్‌లైన్‌లో ఆధార్ సంఖ్యతో ఈ రోజునుంచి నమోదు చేసుకోవాలని, వీరికి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత టికెట్లను కేటాయిస్తామని పేర్కొంది. టికెట్లను పొందిన వారికి ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందజేస్తామని, మూడు రోజుల్లోగా సేవలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది.
నేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 77,067 మంది భక్తులు సమర్పించుకోగా.. 35,457 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.28 కోట్లు.