సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు” కార్యక్రమంలో ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. స్పీకర్ తన అధికారిక నివాసంలోని కూరగాయల తొట్టెలు, పూల కుండీలలో చెత్తను, ఎండిన ఆకులను తొలగించి తాజా నీటితో నింపారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటి రామారావు ఇచ్చిన పిలుపు మేరకు మూడవ ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది.మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కే టి రామారావుకి నా అభినందనలు.ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి నేను కూడా కుటుబ సభ్యులతో పాటుగా ప్రతి ఆదివారం పాల్గొంటున్నాను.దీన్నొక సామాజిక కార్యక్రమంగా భావించి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి లోపలితో పాటుగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.పరిశుభ్రత ప్రాదాన్యత తెలుసు కాబట్టే అభివృద్ది చెందిన దేశాలలో దీన్ని క్రమశిక్షణతో నిరంతరం పాటిస్తారు.మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం నిధులను కేటాయిస్తున్నారు. పరిశుభ్రత, పచ్చదనం కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నారు.
పరిశుభ్రంగా ఉంటే సీజన్లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.ఇదొక మంచి అవకాశం, పట్టణాలు, నగరాలలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.తమ ఆరోగ్యం కోసం వారంలో పది నిమిషాలు కేటాయించడం పెద్ద ఇబ్బంది కాదు. జబ్బులు వచ్చిన తరువాత లక్షలు ఖర్చు చేయడం కన్నా ముందస్తు శుభ్రతతో నివారించవచ్చు అని పోచారం పేర్కొన్నారు.