బాలు పాట వింటూ పరవశించిపోని వాళ్లుండరు .. మధురమైన ఆ పాటకి మనసును అప్పగించని వాళ్లుండరు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం ఇటీవల ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం కోసం ఒక పాట పాడారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి స్వరాలను అందించారు.
తెలుగు సినిమాలో రెండు మూడు దశాబ్దాల పాటు ప్రధానంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిసే వినిపించింది. ఒక దశలో ‘నేపథ్య గానం’ అనే క్రెడిట్ కింద బాలు తప్ప మరో సింగర్ పేరే కనిపించేది కాదు. ఒక్కడే అన్ని పాటల్నీ అద్భుతంగా పాడేవాడు బాలు. ఇలా సుదీర్ఘ కాలం పాటలు పాడి పాడి అలసిపోయిన గాన గంధర్వుడు.. గత కొన్నేళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందులోనూ గత రెండు మూడేళ్లలో బాలు పాటలు బాగా తగ్గించేశారు. ఏదైనా సినిమాలో ఆయన పాడితే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో తాను మాత్రమే పాడగలిగే సినిమా ఒకటి వచ్చింది బాలుకి.
కె. రాఘవేంద్రరావు – నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇందులో ఓ పాట నిమిత్తం ఎం.ఎం.కీరవాణి.. బాలును పిలిపించాడట. ముందు ఈ పాటను వేరే సింగర్ తో పాడించిన కీరవాణి.. ట్రాక్ దర్శకుడికి ఇచ్చాడట. దాంతోనే రాఘవేంద్రరావు ఆ పాటను చాలా హృద్యంగా.. భావోద్వేగభరితంగా తెరకెక్కించారట. ఆ తర్వాత బాలుకు ఆ విజువల్స్ చూపించి.. పాడమని చెప్పాడట.
బాలు ఆ పాట పాడుతూ రాఘవేంద్రుడు ఆ పాటను చిత్రీకరించిన తీరు చూసి ఉద్వేగానికి లోనయ్యారట..అంతే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు మరోసారి నాగార్జున కు మరో భక్తి రస హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యారట.అయినా బాలు పాడిన భక్తి పాటలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన పాడిన భక్తి పాటలన్నీ ఆణిముత్యాలే.