భారతదేశంలో ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇవి కర్ణాటక, తమిళనాడులోని ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే తెలంగాణలోకి వచ్చే వారం ప్రవేశించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటుగా తెలంగాణలో భారీగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, భద్రాచలం, నల్లగొండ, రామగుండం, హనుమకొండ, మెదక్, నిజామా బాద్ జిల్లాలో 40డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనట్టు వాతావరణశాఖ వివరించింది.
మరోవైపు ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాను అతితీవ్రంగా మారింది. గుజరాత్‌వైపు దూసుకువస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గుజరాత్ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఉన్నతాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలను ఆలెర్ట్ చేసింది. గుజరాత్‌తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
Also Read: ధర్మ పరిరక్షణ కోసం జనసేనాని యాగం..