ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల హామీలిస్తుంటారు. ఫ్రీ గ్యాస్,ఫ్రీ టీవీ, ఫ్రీ డిష్ కనెక్షన్ ఇలాంటివి తమిళనాట ఎక్కువగా వింటుంటాం. ఇందులో భాగంగానే కాసింత వింతగా ఆలోచించాడో నాయకుడు. తాను గెలిస్తే ఏకంగా చంద్రమండలానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి ముందుకుసాగుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే..తమిళనాడుకు చెందిన శరవణన్ అనే వ్యక్తి దక్షిణ మధురై నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. ప్రచారంలో భాగంగా ఆయన అనూహ్య హామీలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం పైకి బ్యాచ్‌ల వారీగా తరలిస్తానని శరవణన్ అంటున్నారు.
అంతేగాదు తన నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తా. ఇళ్లలో ఆడవాళ్లకు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ చేస్తాననే హామీలతో ఆకట్టుకుంటున్నాడు. ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు 300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండతోపాటు ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమంగా సముద్రాన్ని నిర్మిస్తా… నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా ఐఫోన్లు అందిస్తా అని ప్రచారంలో దూసుకుపోతున్నారు.