వరంగల్ టెక్స్ టైల్స్ పార్కులో పెట్టుబడులకు దక్షిణ కోరియా టెక్స్ టైల్ దిగ్గజాలకు మంత్రి కెటి రామారావు అహ్వానం పలికారు. బేగంపేటలోని క్యాంప్ ఆఫీసులో దక్షిణ కొరియా టెక్స్ టైల్ ప్రతినిధుల బృందంతో సమావేశమైన కేటి రామారావు, కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో ప్రధాన పెట్టుబడిదారులుగా ఉండాలని వారిని కోరారు. కొపొతీ చైర్మన్ అధినేత కిహాక్ సుంగ్ మరియు అయన బృందం మంత్రితో సమావేశం అయ్యారు.
కాకతీయ పార్క్ స్వరూపం, సౌకర్యాలను కొరియన్ బృందానికి వివరించిన కేటి రామారావు , రెండు వేల ఎకరాల్లో ఏర్పాటుచేయబోయే టెక్స్ టైల్ పార్క్, దేశీయ పరిశ్రమలతో పాటు అంతర్జాతీయ పరిశ్రమలకు వేదిక కాబోతుందన్నారు. పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్ని ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఇంతేకాదు ఆయా కంపెనీలు కోరుకున్న విధంగా పార్క్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. టెక్స్ టైల్ పార్క్ లోని పరిశ్రమల అవసరాల కోసం ఇక్కడి కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫలితంగా పలు అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణలో స్కిల్డ్ లేబర్ అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రాధాన్యతల గురించి కొరియన్ ప్రతినిధి బృందానికి మంత్రి వివరించారు. వరంగల్ పార్కులో అవసరం అయితే దక్షిణ కోరియా కంపెనీలకు ప్రత్యేకంగా కొంత స్ధలాన్ని కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
టెక్స్ టైల్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకట్టుకుందన్న సుంగ్, పార్క్ కు అవసరమైన విద్యుత్, కార్మికుల లభ్యత, ప్రోత్సాహకాలను అడిగితెలుసుకున్నారు. వరంగల్ లో విమాన సౌకర్యం గురించి మంత్రి ని ఆరా తీశారు. దీనిపై స్పందించిన మంత్రి, అంతర్జాతీయ స్థాయి యాంకర్ ఇన్వెస్టర్ లను దృష్టిలో ఉంచుకుని కేంద్రంతో మాట్లాడి త్వరలోనే వరంగల్ లోని ఎయిర్ స్ర్టీప్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్ టైల్ శైలజా రామయ్యర్ తో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చిన దక్షిణ కొరియా టెక్స్ టైల్ ప్రతినిధి బృందం మంత్రితో సమావేశం తర్వాత పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ, హ్యాండ్ లూమ్, టెక్స్ టైల్ శాఖ ల అధికారులతో భేటీ అయింది. రేపు ఒక రోజు మెగా టెక్స్ టైల్ పార్క్ తో పాటు స్థానికంగా ఉన్న పరిశ్రమలను పరిశీలిస్తుంది.