నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం.. విద్య, వైద్య తదితర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నదని, ముఖ్యంగా మైనార్టీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నదని తెలుసుకోవడం తమకు సంతోషంగా వున్నదని సాది అరేబియా అంబాసిడర్ డా.సాద్ మహమ్మద్ అల్సతీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తెలిపారు. నూతన తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో తామూ భాగస్వామ్యం పంచుకుంటామని అందుకు సంబంధించి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్దమని సౌదీ అంబాసిడర్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధులతో కలిసి డిప్యూటీ సిఎం మహమూద్ అలి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సౌదీ అంబాసిడర్ మహ్మద్ అల్ సతి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ మాట్లాడుతూ.. హైదరబాదీ సాంస్కృతిక వారసత్వం సౌదీ అరేబియా సంస్కృతితో ముడిపడి వున్నదన్నారు. తెలంగాణ నుంచి వెళ్లే హజ్ యాత్రికుల సౌకర్యార్ధం అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా సౌదీలోని కాబాకు సమీపంలో. రుబాత్ (వసతి గృహం)ను నిర్మించిన విషయాన్ని సిఎం వారికి గుర్తు చేశారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన హజ్ యాత్రికులను సౌదీ వారు “అల్లా అతిధులు” అని పిలుస్తారని, అట్లా పిలవడం తెలంగాణకు సౌదీ ప్రజలిచ్చే గౌరవంగా భావిస్తున్నామని సిఎం తెలిపారు. ఇది ప్రపంచంలో మరెవరికీ దక్కని గౌరవమని అన్నారు. సౌదీతో నాటి నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజలకు సత్సంబంధాలున్నాయన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా సౌదీ అరేబియా కాన్సులేట్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. అయితే హైదారాబాద్ లో తమ కాన్పూలేట్ బాగుంటుందని తామూ భావిస్తున్నట్టు సౌదీ అంబాసిడర్ సిఎం కు తెలిపారు. ఆమేరకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నయన్నారు.
దాదాపు మూడు లక్షలకు పైగా తెలంగాణ జిల్లాలనుంచి సౌదీలో నివసిస్తున్నారని ఈ సందర్భంగా సిఎం అన్నారు. గత హైదరాబాద్ స్టేట్ కు సంబందించిన వివిద ప్రాంతాలనుంచి కూడా సౌదీలో నివసిస్తున్నారని హైదరాబాద్ కేంద్రంగా వారి రాకపోకలు సాగుతున్నందున వారందరికి కాన్సులేట్ అందుబాటులో వుంటుందని అన్నారు.
సౌదీలో నివసిస్తున్న తెలంగాణ వాసులు అకస్మాత్తుగా మరణిస్తే పార్ధివ దేహాలను అంతిమ సంస్కారాల కోసం తీసుకురావడానికి ఇబ్బందిగా మారిందని ఈ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని సిఎం అన్నారు. అందుకు సంబందించిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సౌదీ అంబాసిడర్ అల్సతీకి వివరించారు.
అనాదిగా సాగుతున్న పాత దోస్తాన్ ను పునరుజ్జీవింప చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా వుందని తెలిపిన సిఎం, సౌదీతో తెలంగాణకు సంబంధాలు మరింతగా బలపడేందుకు వ్యాపార పెట్టుబడులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు.
కాగా తెలంగాణ అనతి కాలంలోనే మానవాభివృద్ధి రంగంలో దూసుకుపోతున్నదనే విషయం తమకు అర్థమయిందని అల్సతీ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశం పై ప్రభుత్వ ప్రయివేటు కమర్షియల్ రంగ నిపుణలతో శుక్రవారం సిఐఐలో సమావేశమయిన తాము తెలంగాణ ఆర్థికాభివృద్ధి గురించి తెలుసుకున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే తమ ఫైనాన్స్ కమర్షియల్ మంత్రిత్వ శాఖల అధికారులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా కసరత్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందని సిఎంకు సౌదీ అంబాసిడర్ తెలిపారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీని సౌదీ ప్రతినిధులకు ఈ సందర్భంగా వివరించిన ముఖ్యమంత్రి, తెలంగాన అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమయిందిగా తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీల కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంకేమ పథకాలను సౌదీ అంబాసిడర్ కు సిఎం వివరించారు. ఈ మేరకు సంతృప్తి వ్యక్తం చేసిన అల్సతీ.. తమ దేశం కూడా భారత యువత విద్యాభ్యాసం కోసం 460 స్కాలర్ పిప్పులను మతానికి అతీతంగా అందిస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తో పాటు టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎసిపీ డిజి ఎ.కె.ఖాన్, ఎమ్మెల్సీ సలీం, మైనారిటీ వెల్పేర్ సెక్రటరీ ఉమర్ జలీల్, సాదీ అరేబియా ప్రభుత్వ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.