నల్లధనం అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ముఖ్యంగా సోషల్ మీడియాలో మోడీ ప్రశంసల జల్లు కురుస్తోంది. తమదైన కామెంట్లతో నల్లకుబేరులపై జోకులు పేలుస్తున్నారు. ‘ఇప్పుడు డబ్బంతా ఏం చేసుకుంటారో పాపం’ అంటూ జోకులు పేలుస్తున్నారు. ‘అమెరికాలో ఓట్లు లెక్కిస్తున్నారని, భారత్‌లో నోట్లు లెక్కిస్తున్నారు,’ ‘ఇవి భారత్ 9/11 దాడులని’ కామెంట్లు చేస్తున్నారు.
రేపటి నుంచి ఎందుకూ పనికి రాని నోట్లను పల్లీలు కట్టే పొట్లాలుగా మలిచి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు ఈ చర్యను ఆర్థిక ఎమర్జెన్సీగా అభివర్ణించారు.
పాత నోట్లను చుట్టి అందులో పల్లీ బఠానీ అమ్ముతున్నట్టుగా నెటిజన్లు ఫోటోలను పోస్టు చేయగా, 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదనీ, కిలో 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామంటూ కొందరు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు ఆపితే వెంటనే వెయ్యి రూపాయల నోటు ఇచ్చేమని మరికొందరు ఇలా పలువురు సెటైర్లు వేశారు. అమెరికాలో ఓట్ల లొల్లి… ఇండియాలో నోట్ల లొల్లి అంటూ ఇంకొందరు ఇలా తాజా ప్రకటనపై రకరకాలుగా స్పందించారు.
ప్రతి ఇంట్లో గృహిణి తమ భర్త ముందు బ్లాక్ మనీని బయటపెట్టనుందని, ఇంతకాలం భర్తకు తెలియకుండా ఇంట్లో అప్పుడో ఇప్పుడో దాచుకున్న ఈ నోట్లను ఒక్కసారిగా బయటకు తీసి వెల్లడించనున్నారంటూ కొందరు జోకులు పేల్చారు. ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ పాత నోట్లకు నివాళులర్పిస్తూ పలువురు పోస్టులు పెట్టారు.
వృథా పోవు… తిరుపతి హుండీలో వేసుకోండని కొందరు సలహా ఇచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితేంటని కొందరు ప్రశ్నిస్తే మరికొందరు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి వెంటనే మీరు ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లకు వెళ్లండని మరికొందరు సలహాలిచ్చారు.
ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఇలా రాశారు. ట్రాఫిక్‌ను ఉల్లంఘించినందుకు ఓ పోలీసుకు నేను రూ.500 ఇచ్చాను. కానీ అతను నాకు రూ.100 ఫైన్ వేశాడు.
అమెరికా ఓట్లను కౌంట్ చేస్తుంటే, భారత్ నోట్లను కౌంట్ చేస్తోంది. – ఛాయ్ తాగనీయకుండా దేశాన్ని నిద్రలేపుతున్న ఒకే ఒక్క చాయ్‌వాలా మోడీ మాత్రమే. (రూ.500, రూ.1000 నోట్లు బ్యాన్ చేయడంతో బుధవారం ఉదయం పాలప్యాకెట్లు కొనడం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఆ కామెంట్ చేశారు.) – అందరూ అమెరికా ఎన్నికల పరీక్షలకు సిద్ధమైతే, సిలబస్‌లో లేని మోడీ ప్రశ్న వచ్చింది.
మేకలకు ఆహారంగా పెట్టినట్లు… పల్లీలు తినే పొట్లంగాను… చివరికి టాయిలెట్ పేపర్ గానూ చూపుతూ రూ.500,రూ1000 నోట్లు సోషల్ మీడియాలో చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి.
ఎక్స్లూజివ్ పిక్చర్సు ఆఫ్ బ్లాక్ మనీ హోల్డర్సు అంటూ ఏడుస్తున్న ఫొటోలను షేర్ చేశారు.
రజనీకాంత్ శివాజీల కాంబినేషన్లో వచ్చిన శివాజీ సినిమాలా ఉందంటూ మరికొందరు సినిమాటిక్ గా చెప్పారు.
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి పలువురు ఆస్పత్రుల్లో చేరిపోతున్నారని (ఆస్పత్రుల్లో పాత నోట్లను అనుమతిస్తారు కాబట్టి), అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూలు నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు దర్శనమిచ్చాయి. మీ వద్ద ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలు… ఇప్పుడు మీకు ఓ కొత్త ఉద్యోగం దొరికనట్టే… రేపటి నుంచి బ్యాంకుల వద్ద నిలబడి మీరు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు.
చిల్లర ఇవ్వలేక నిత్యం చికాకు పడుతున్న చిన్న చిన్న వ్యాపారులకు తలనొప్పి పోయిందని కొందరు, జేబుల్లో వ్యాలెట్లకు బదులుగా ఇక నుంచి బ్యాగులు కొనుగోలు చేసుకోవాలని మరికొందరు… బిల్డర్లు, పొలిటీషియన్లు ఇకనుంచి బ్రీఫ్ కేసులకు బదులు సూట్ కేసులకు కొనుగోలు చేయాలి… ఇలా రకరకాల జోకులు పేల్చూతూనే ఉన్నారు.