స్మార్ట్ సిటీగా కరీంనగర్…

244
Smart City status to Karimnagar
- Advertisement -

దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఇప్పటికే 60 నగరాలను ఆకర్షణీయ నగరాలుగా ప్రకటించారు.  తాజాగా మరో 30 నగరాలను స్మార్ట్ సిటీలుగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. మొత్తం 40 నగరాలకు.. 45 నగరాలు పోటీపడ్డాయనీ… అయితే అందులో 30 నగరాలు చోటు దక్కించుకున్నాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు. మిగిలిన వాటిని మరో విడతలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఈ నగరాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం రూ. 57,393 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం మొదటి స్థానంలో.. ఛత్తీస్‌గఢ్‌ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్‌ రెండవ స్థానాల్లో నిలిచాయి. కాగా ఏపీ నుంచి అమరావతి, తెలంగాణ నుంచి కరీంనగర్‌ చోటు దక్కించుకున్నాయి. తమిళనాడు నుంచి 4 , కేరళ 1, ఉత్తరప్రదేశ్‌ 3, గుజరాత్‌ 3, కర్ణాటక 1, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 2 నగరాలకు చోటు దక్కినట్లు వెంకయ్య తెలిపారు.

ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్‌కు చోటు దక్కడంతో నగర వాసులు సంబురాలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కృషి వల్లే కరీంనగర్‌కు ఈ జాబితాలో చోటు దక్కిందని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు బాణసంచ కాల్చి  తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -