`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్) నూతన కార్యవర్గం శివాజీ రాజా అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా నేడు ( ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో `మా` అధ్యక్షలుగా శివాజీ రాజా..మిగత కార్యవర్గ సభ్యులను తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఇదే వేదికపై `మా` తరుపున కళాతస్వీ కె.విశ్వనాథ్, సీనియర్ నటి శారదలను సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు సత్కరించారు.
అనంతరం తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ` గత మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. కానీ ఈ సారి మా టీమ్ అంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అప్పట్లో చిరంజీవిగారు, కృష్ణ వంటి పెద్దలు ఆధ్వర్యంలో `మా`కు బీజం పడింది. నాటి నుంచి నేటి వరకూ కళాకళారుల శ్రేయస్సు కోసం అందరూ కృషి చేస్తున్నారు. కమిటీలో ఉన్న మెంబర్లు అందరికీ తగిన విధంగా న్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరుపున కూడా `మా` కు సహాయం అందజేయడానికి ఎప్పుడూ ముందుటాం. ప్రభుత్వం తరుపున 1000 రూ..లు పెన్షన్ అందిస్తాం. అలాగే పేద కళాకారులకు రేషన్ కార్డులు కూడా అందించాలనుకుంటున్నాం. `మా`లో ఆరోగ్య సమస్యలు తలెత్తితే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల కోసం ఐదవ ఆట ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ ఈ విధానం ఎక్కడా అమలులో లేదు. షూటింగ్ లకు ఇబ్బందులు కలగకుండా అనుమతులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. దసరా నుంచి నంది అవార్డుల స్థానంలో కొత్త పేరుతో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది` అని అన్నారు.
మా నూతన అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ ` మా లో సభ్యులంతా నన్ను విశ్వసించి నాకు బాధ్యత అప్పగించారు. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాను. ఏ నిర్ణయం తీసుకున్నా 26 మందితో సంప్రదించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాం. పెన్షన్ 25శాతం పెచుతున్నాం. ఈనెల నుంచే కొత్త విధానం అమలులోకి వస్తుంది. అలాగే మాకు కొత్త భవనం ఏర్పాటయ్యే విధంగా శ్రమిస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి స్థలం అడుగుదాం. ఆయన్ను ఒకే అంటే భవనం ఏర్పాటు చేసుకుని ఆయన పేరు పేరుతోనే రన్ చేస్తాం. అలాగే ఆర్టిస్టులంతా కూడా `మా` లో మెంబర్ షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈసారి మా సిల్వర్ జూబ్లీ వేడుకలు సినీ పెద్దలు సమక్షంలో ఘనంగా చేస్తాం` అని అన్నారు.
`మా ` ప్రధాన కార్యదర్శి వి.కె. నరేష్ మాట్లాడుతూ ` దాసరిని కలిసి ఏకగ్రీవంగా `మా` ను ఎన్నుకుందాం అంటే..ఆయన వెంటనే పెద్దగా నా బాధ్యత అని మమ్మల్ని ప్రోత్సహించారు. నాగబాబు మిగతా వారుకూడా అలాగే స్పందించారు. మా ఆధ్వర్యంలో ఏర్పడిన `మా` ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మా మెడలో పడిన ప్రతీ దండ ఓ బాధ్యత.. బరువు…నమ్మకం.. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తాం. ఈ సారి కొత్తగా కల్చరల్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం` అని అన్నారు.
`మా` చీఫ్ అడ్వైజర్, సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ` ఈ సారి మా కోసం కొత్త టీమ్ వచ్చింది. మా ను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని..కళా కారులందరికీ న్యాయం జరిగేలా పథకాలు ఉండాలి. అలాగే ఆదుర్తి తెనమనసులు సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయినా … నటనలో ఓనమాల నేర్చుకుంది కె. విశ్వనాద్ దగ్గరే. ఆయనకు నా చేతుల మీదుగా సత్కారం చేయడం సంతోషంగా ఉంది` అని అన్నారు.
కళాతపస్వీ కె. విశ్వనాథ్ మాట్లాడుతూ ` ఇంత మంది స్టార్స్ ఉన్నా దాసరి నారాయణరావు ఇక్కడ లేకపోవడం తో ఏదో వెలితిగా ఉంది` అని అన్నారు.
సీనియర్ నటి శారద మాట్లాడుతూ ` మా తరుపున సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భాష, మతం, కులం అనే బేధం లేదు. అంతా ఒక్కటే. అందరికీ సమన్యాయం జరగాలి. శివాజీరాజా, నరేష్ లను లవకుశల్లా ఉన్నారు. `మా` లో మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలి` అన్నారు.
విజయ నిర్మల మాట్లాడుతూ ` మా మెంబర్లు అంతా ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తున్నారు. `మా` 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జుబ్లీ వేడుకలు ఘనంగా చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
నాగబాబు మాట్లాడుతూ ` `మా` మెంబర్ షిప్ రుసుము ఎక్కువైంది. లక్ష రూపాయలు ఉన్న రుసుమును తగ్గించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఇదే వేదికపై `మా` లోని కొంత మంది కళాకారులకు ద్విచక్ర వాహనాలను, చెక్ లను అందించారు. ప్రత్యేకంగా సీనియర్ పాత్రికేయలు పసుపులేటి రామారావు కు మా తరుపున స్కూటర్ అందించారు. అలాగే ఈ కార్యకమంలో మా మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
`మా` కొత్త టీమ్:
1.జి. శివాజీ రాజా ( మా ప్రెసిడెంట్)
2. ఎమ్. శ్రీకాంత్ ( ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్)
3. ఎమ్.వి. బెనర్జీ ( వైస్ ప్రెసిడెంట్)
4.కె. వేణు మాధవ్ ( వైస్ ప్రెసిడెంట్)
5.వి.కె నరేష్ ( జనరల్ సెక్రటరీ)
6. హేమ ( జాయింట్ సెక్రటరీ)
7. ఏడిద శ్రీరామ్ ( జాయింట్ సెక్రటరీ)
8. పరుచూరి వెంకటేశ్వరరావు ( ట్రెజరర్)
కార్యవర్గ సభ్యులు:
1. ఏ.లక్ష్మీనారాయణ ( టార్జన్ )
2. ఏ. ఉత్తేజ్
3. అనితా చౌదరి
4. బి. గౌతం రాజు
5. సి. వెంకటగోవిందరావు
6. ఎమ్. ధీరజ్
7. పసునూరి శ్రీనివాసులు
8.గీతా సింగ్
9.ఎమ్. హర్ష వర్ధన్ బాబు
10. హెచ్. జయలక్ష్మి
11.ఎస్. మోహన్ మిత్ర
12. కొండేటి సురేష్
13. కుమార్ కోమాకుల
14.వి.లక్ష్మీకాంత్ రావు
15. ఎమ్. నర్సింగ్ యాదవ్
16. ఆర్. మాణిక్
17. నాగినీడు వెల్లంకి
18. సురేష్