సీతారామం లాంటి కథ ఇప్పటి వరకూ రాలేదు : దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ

63
dulquer
- Advertisement -

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’ రష్మిక మందన కీలక పాత్ర పోషిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో దుల్కర్ సల్మాన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి.

‘సీతారామం’ ప్రమోషన్స్ తో చాలా బిజీగా వున్నట్లున్నారు ?
అవునండీ. అసలు ప్రేక్షకుల నుండి వస్తున్న ఈ రెస్పాన్స్ ని ఊహించలేదు. వారి ప్రేమకి కృతజ్ఞతలు.

మీ గత చిత్రాలకు, ‘సీతారామం’కు వున్న మేజర్ ఎట్రాక్షన్ ఏమిటి ?
‘సీతారామం’ చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా వుంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్రేమకథలు ఇక పై చేయనని చెప్పారు కదా ?
వాటికి కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నాను. రోజురోజుకి నా వయసు కూడా పెరుగుతుంది కదా.. ఇంకా పరిణితి గల విభిన్నమైన పాత్రలు చేయాలనీ వుంది. ఫ్రెష్ , ఒరిజినల్ గా వుండే పాయింట్ల ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను.

‘సీతారామం’ మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది కదా.. మీ ఫేవరేట్ సాంగ్ ?
విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. కథ విన్నప్పుడు సినిమాలో సంగీతం బావుంటుందని తెలుసు. కానున్న కళ్యాణం పాట కాశ్మీర్ లో షూట్ చేస్తున్నప్పుడే మ్యాజికల్ గా వుంటుందని అర్ధమైయింది. పాటలన్నీ విజువల్ వండర్ లా వుంటాయి. ఒక పాటకు మించి మరో పాట ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది. కానున్న కళ్యాణం పాట నా ఫేవరేట్. తెలుగు అద్భుతమైన భాష. పాటల్లో ప్రతి వాక్యం భావం తెలుసుకున్నాను

‘సీతారామం’ లో మీ పాత్ర గురించి చెప్పండి ?
రామ్ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తా. రామ్ ఒక అనాధ. రామ్ కి దేనిపైనా ద్వేషం వుండదు. వెరీ హ్యాపీ, పాజిటివ్. అతనికి దేశభక్తి ఎక్కువ.

వైజయంతి మూవీస్ తో రెండో సినిమా కదా.. ఎలా అనిపించింది ?
అశ్వనీ దత్, స్వప్న గార్ల వైజయంతి మూవీస్ అంటే నాకు ఫ్యామిలీ లాంటింది. ఒక మంచి మనిషిగా అశ్వనీ దత్ నాకు ఎంతో ఇష్టం. ఆయన నా ఫేవరేట్ పర్సన్. చాలా పాజిటివ్ గా వుంటారు. ఆయన చూపించే ప్రేమ, వాత్సల్యం చాలా గొప్పగా వుంటుంది. నా కోసం ది బెస్ట్ ని ఎంపిక చేస్తారు. దర్శకుడు హను ఈ కథని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.

సీత గురించి చెప్పండి ?
ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలని ఇలా ఉంటాయేమోనని ఇమాజిన్ చేసుకుంటాం. ‘సీతారామం’ కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా లానే ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చేసరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్ లో మృణాల్ ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేసింది. ఇక ఆఫ్ స్క్రీన్ కూడా తను హ్యాపీ, ఎనర్జిటిక్ పర్సన్.

రష్మిక పాత్ర గురించి ?
ఇందులో కొత్త రష్మిక ని చూస్తారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. సీతారామంలో రష్మిక గ్రేట్ ఎనర్జీ.

పదేళ్ళలో వివిధ భాషల్లో దాదాపు 35 చిత్రాలు చేశారు. అలాగే వివిధ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఎలా సాధ్యపడింది?
నిజానికి నేను తక్కువే చేశాను. మలయాళంలో నా సమకాలికులు ఏడాదికి 12 సినిమాలు చేస్తున్నారు. మా నాన్న గారే ఏడాది 30కి పైగా సినిమాలు చేసిన సందర్భాలు వున్నాయి. వాళ్లతో పోల్చుకుంటే నేను తక్కువ చేసినట్లే.

‘పాన్ ఇండియా మూవీ’ అనే మాట మీకు నచ్చదు కదా.. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏమని పిలుస్తారు ?
‘పాన్ ఇండియా అనే ట్యాగ్ విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్ కూడా వుండటం లేదు. నిజానికి పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని ఒత్తి చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్. ఫిల్మ్ ని ఫిల్మ్ అంటే చాలు.

తెలుగులో మీకున్న క్రేజ్ ని మొదటిసారి ఎప్పుడు తెలిసింది ? వైజాగ్, విజయవాడ ఈవెంట్స్ గురించి ?
తెలుగు ప్రేక్షకులు నాపై చూపిన అభిమానం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. చాలా రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కి వచ్చినపుడు ”మీ సినిమా ఉస్తాద్ హోటల్ చూశాం. చాలా బావుంది’ అని ఓ ముగ్గురు కుర్రాళ్ళు చెప్పారు. అది నా రెండో సినిమా. ఆ చిత్రానికి కనెక్ట్ అవ్వడం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. అలాగే నా చిత్రాలు వివిధ ఓటీటీ వేదికలపై చూసి సినిమాల పట్ల వున్న ఒక ప్యాషన్ తో చాల మంది కనెక్ట్ అవ్వడం ఆనందమనిపించింది. మహానటి సమయంలో నా కాళ్ళకి గాయం కావడంతో ఈవెంట్స్ కి రాలేకపోయాను. ఇప్పుడు సీతారామం ప్రమోషన్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. వైజాగ్, విజయవాడ ఈవెంట్స్ అభిమానుల చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. ఆ రెస్పాన్స్ ని నేను ఊహించలేదు. నిజంగా నేను అదృష్టవంతుడ్ని.

సీతారామంలో భారీ తారాగణం వుంది కదా.. ?
అవునండీ. తెలుగు, తమిళ్, బెంగాలీ ఇలా వివిధ పరిశ్రమల ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు. షూటింగ్ అద్భుతంగా జరిగింది. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్ రెండోసారి నటించడం ఆనందంగా వుంది.

యాక్టర్ కాకపోయింటే ఏమయ్యేవారు ?
ఇది నాకు కూడ ఆందోళనకరమైన ఆలోచనే (నవ్వుతూ) బిజినెస్ స్కూల్ లో చదువుకున్నాను. ఎంబీఎ చేశాను. బహుశా ఇన్వెస్టర్ ని అయ్యేవాడినేమో.
నాన్న నాకు ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం. సినిమాలు, కథలు గురించి ఇంట్లో మాట్లాడుతుంటాం. నేను నా కథలని సింగిల్ లైన్ లో చెబుతుంటాను. నాన్న నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనే నా హీరో.

దర్శకత్వం చేసే ఆలోచన ఉందా ?
చేయాలని వుంది. కానీ ఇప్పుడంత సమయం లేదు. నా దర్శకత్వంలో సినిమా వస్తే మాత్రం అది ప్రేక్షకుల ఊహకు భిన్నంగా వుంటుంది.

అల్ ది బెస్ట్
థాంక్స్

- Advertisement -