తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, స్థానిక నగర సమస్యలపై చర్చించేందుకు గ్రేటర్ హైదరాబాద్ భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ బలాన్ని సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశంలో నగర పరిధిలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో పాటు ఎస్.ఐ.ఆర్ (SIR) కమిటీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రజాపోరాటాలపై నేతలతో కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎస్.ఐ.ఆర్ (SIR) అమలు తీరు, దానిపై వస్తున్న ప్రజా అభ్యంతరాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ వల్ల నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు.ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై గళం విప్పాలని, ప్రజల నుండి వస్తున్న అభ్యంతరాలు మరియు సూచనలను క్రోడీకరించి పార్టీ తరపున ఒక స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
Also Read:తక్కువ క్యాలరీలతో రుచికరమైన సూప్‌లు!

