రెండు నెలలుగా చర్చనీయంశంగా మారిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై తుది కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్ ఈనెల 10న ముహుర్తం ఖరారు చేసినట్లు సమాచారం. వసంతపంచమి కావడంతో అదేరోజున మంత్రివర్గ విస్తరణ జరిపితే బాగుంటుందని కేసీఆర్ ఆలోచనట.
తొలిదశలో కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈసారి కేబినెట్ విస్తరణ ఎలా ఉండబోతుందా అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కేబినెట్‌లో 18 మందికి మాత్రమే మంత్రులుగా ఉండే అవకాశం ఉండటంతో ఈ సారి కేబినెట్‌ను 7 లేదా 8 మందికే పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిస్ధాయి కేబినెఎట్‌ను విస్తరించనున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయని భావిస్తున్న నేతలు ప్రగతి భవన్ నుంచి ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందా అన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటం, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో మంత్రివర్గ విస్తరణ తప్పనిసరి. ఫిబ్రవరి మూడో వారంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ జరగనుండటంతో కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇక బడ్జెట్‌పై ఇప్పటికే శాఖల వారీగా నివేదిక తెప్పించుకున్న కేసీఆర్..ఆర్థికమంత్రి బాధ్యతను ఎవరి భుజాలమీద వేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. గతంలో ఆర్థికశాఖమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు తిరిగి అప్పగిస్తారా లేదా తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖను అప్పగిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
2014 ఎన్నికల్లో పోటీచేసిన ఓటమిపాలైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కీలకమైన నామినేటెడ్ పోస్టు అప్పగించారు. తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. తన పదవికి నూటికి నూరుశాతం న్యాయం చేసిన నిరంజన్ రెడ్డికి ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేగాదు ఆయనకు కీలకమైన ఆర్ధికశాఖ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా గుర్తింపు తెచ్చుకోనున్నారు నిరంజన్ రెడ్డి.