అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్యుల పరిస్థితి ఎలా ఉన్నా.. సెలబ్రిటీల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇటీవల ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాస్‌పోర్ట్, ఇతర వస్తువులు కూడా ఇలాగే అమెరికాలో చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఎలాగోలా అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీలో డూప్లికేట్ పాస్ పోర్టు పొందారు. తాజాగా మరో గాయని చిన్మయ్‌కి కూడా ఇదే అనుభవం ఎదురైంది. అక్కడ కొందరు దుండగులు చిన్మయి కారును ధ్వంసం చేసి, అందులోని వస్తువులను దొంగలించారట.
ప్రస్తుతం చిన్మయి శ్రీపాద మ్యూజిక్ టూర్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్నారు. తన వస్తువుల దొంగతనం గురించి చిన్మయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కారును పార్కింగ్ చేసి ఉండగా చోరీ జరిగినట్లు చెప్పారు. కారులోని వస్తువులను దొంగలించారని గుర్తించడానికి తనకు ఐదు నిమిషాలు పట్టిందన్నారు. చోరీకి గురైన తన వస్తువులన్నీ తిరిగి దొరుకుతాయన్న నమ్మకం ఉందన్నారు. ‘దేవుడా దయచేసి వెళ్లి మరొకరితో ఆడుకో’ అని చిన్మయి ట్వీట్ చేస్తూ.. నిరాశ వ్యక్తం చేశారు. చోరీకి గురైన తన వస్తువులన్నీ తిరిగి దొరుకుతాయన్న నమ్మకం ఉందన్నారు.
కాగా, ఈ ప్రాంతంలో ఇలాంటి దొంగతనాలు సాధారణమేనని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు పేర్కొన్నట్లు తెలిపారు. నిజంగా అక్కడ పోలీసులు చాలా బాధ్యతతో ప్రవర్తించారని చిన్మయి అన్నారు. చోరీ జరుగుతుండగా చూసి, వారిపై కేకలు పెట్టిన పక్కింటి వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు. మంచి వారు ఇంకా భూమిపై ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.