నైనీ కోల్ మైన్స్ టెండర్ల విషయంలో తీవ్ర వివాదం నెలకొనడంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ టెండర్లపై ఇటీవల అవినీతి, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.
ఈ అంశంపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ, ఆరోపణలు తలెత్తిన పరిస్థితుల్లో పారదర్శకత దృష్ట్యా టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ ముందే సింగరేణి ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, పాలనాపరమైన కారణాల వల్ల నైనీ కోల్ మైన్స్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నైనీ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ కూడా సింగరేణి పాలకమండలిని ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలిలో ఎందుకు చర్చ జరగలేదని కేంద్ర బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
పాలకమండలిలో చర్చ జరగకపోవడమే అవినీతి ఆరోపణలకు కారణమా? టెండర్ వేయదలచిన కంపెనీలకు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాలు ఎందుకు జారీ చేయడం లేదన్న అంశాలపై కూడా కేంద్రం సందేహాలు వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో సింగరేణి అధికారులు స్పందిస్తూ, టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదని తెలిపారు. నిబంధనలు, టెండర్లపై పాలకమండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గమనార్హం ఏమిటంటే, 2016లో కూడా నైనీ కోల్ మైన్స్ టెండర్లపై ఆరోపణలు వచ్చాయి. తాజా నిర్ణయంతో నైనీ కోల్ మైన్స్ టెండర్లు రెండోసారి రద్దు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:‘స్వయంభూ’..విడుదల తేదీ వాయిదా!

