ఒక దేశం ఒకే పన్ను విధానం లాగానే ‘ఒక దేశం ఒకేసారి ఎన్నికలు’ అనే జమిలి ఎన్నికల నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. ఇందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్దం చేస్తుండగానే ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి లోక్ సభతో పాటు అన్నిరాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెరమీదికి వచ్చింది.
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) నెట్‌వర్క్ యాప్‌ను ఎన్నికల కమిషన్ బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం నిధులను సమకూర్చిందని తెలిపారు. అయితే జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగిన చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమని చెప్పారు. ఇప్పటికే వీవీపీఏటీల కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు కేంద్రం అందజేసిందని చెప్పారు.
జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు. 1951–52లో తొలి సార్వత్రిక ఎన్ని కల నుంచీ 1967లో నాలుగో లోక్‌సభకు ఎన్నికల వరకూ జమిలిగానే సాగాయి. 1968, 69 సంవత్సరాలలో అస్థిరత చోటు చేసుకుంది. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దయినాయి. 1970లో నాలుగో లోక్‌సభనే రద్దు చేసి 1971లో ఎన్నికలు నిర్వహించారు. దాంతో జమిలి ఎన్నికల ప్రక్రియకు పూర్తి విఘాతం కలిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలి ఎన్నికలకు మరోసారి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.