దక్షిణాది చిత్రసీమకు చెందిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ గౌరవించుకొనే వేడుక… ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా). ఈసారి ఈ సంబరాలకు అబుదాబి వేదిక కానుంది. జూన్ 30, జులై 1 రెండు రోజుల పాటు జరిగే వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
దక్షిణాది తారల సందడితో అబుదాబి మెరిసిపోయింది. సైమా వేడుకల్లో భాగంగా శుక్రవారం తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల తారలతో సైమా వేడుక తళుకులీనింది. ‘జనతా గ్యారేజ్’లో నటనకు గానూ ఎన్టీఆర్‌ను ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఉత్తమ నటిగా రకుల్‌ప్రీత్‌సింగ్ (నాన్నకుప్రేమతో..) అందుకున్నారు. చిన్న చిత్రంగా విడుదలై జాతయ అవార్డును సైతం సొంతం చేసుకున్న ‘పెళ్లిచూపులు’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా ‘వూపిరి’ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ఎంపికయ్యారు.
సైమా వేడుక సందర్భంగా అందాల భామలు అదిరేటి స్టెప్పులతో ఆకట్టుకున్నారు. రెజీనా, ప్రణీత, నిక్కీ గల్రానీ నృత్యాలు అలరించాయి. ఇక అఖిల్ అక్కినేని ఇచ్చిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైమా వేడుకలో అఖిల్ ప్రదర్శనఎంతో సంతోషాన్నిచిందని నాగ్ ట్విట్ చేశారు. తొలి సినిమాతోనే నటుడిగా డ్యాన్సర్ ప్రూవ్ చేసిన అఖిల్, సైమా వేదికపై గాయకుడిగానూ ఆకట్టుకున్నాడు. ‘సైమా 2017 వేదికపై అఖిల్ పాడుతుండగా నేను అక్కడే ఉన్నాను, ఈ ప్రదర్శన కోసం అఖిల్ ఎంతో సాధన చేశాడు’ అంటూ తన తనయుడికి అభినందనలు తెలిపాడు నాగార్జున. ‘దువ్వాడ: జగన్నాథమ్’ వేషధారణలో అల్లు శిరీష్ సందడి చేశారు.
సైమా 2017 అవార్డులు(తెలుగు)
* ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
* ఉత్తమ నటుడు: ఎన్టీఆర్(జనతా గ్యారేజ్)
* ఉత్తమ నటి: రకుల్ ప్రీత్‌సింగ్(నాన్నకు ప్రేమతో)
* ఉత్తమ నటుడు(క్రిటిక్): నాని
* ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (వూపిరి)
* ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
* ఉత్తమ తొలి చిత్ర నటుడు: రోషన్ (నిర్మలాకాన్వెంట్)
* ఉత్తమ తొలి చిత్ర నటి: నివేతా ధామస్(జెంటిల్‌మన్)
* ఉత్తమ సహాయనటుడు: శ్రీకాంత్(సరైనోడు)
* ఉత్తమ నటి: అనసూయ భరద్వాజ్(క్షణం)
* ఉత్తమ హాస్యనటుడు: ప్రియదర్శన్ (పెళ్లిచూపులు)
* ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు (నాన్నకు ప్రేమతో)
* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (జనతా గ్యారేజ్)
* ఉత్తమ నేపథ్య గాయకుడు: సాగర్ (శైలజ శైలజ: నేను శైలజ)
* ఉత్తమ నేపథ్య గాయకురాలు: రమ్య బెహర( రంగదే: అ ఆ)
* ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (ప్రణామం: జనతా గ్యారేజ్)
* తెలుగు చిత్ర పరిశ్రమలో 40 వసంతాలు పూర్తిచేసుకున్నందుకు స్పెషల్ అవార్డు: మోహన్‌బాబు
* జీవిత సాఫల్య పురస్కారం: మురళీమోహన్