తెలంగాణలో అగ్రగామిగా సిద్దిపేట…

212
Siddipet will be No 1 zilla
- Advertisement -

ప్రజల ఆశీర్వాదంతో బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయ , పోలీస్‌కమిషరేట్,మెడికల్ కాలేజీ  నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.  అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో  మాట్లాడిన సీఎం  సిద్దిపేట జిల్లాకు వరాల జల్లుకురిపించారు. త్వరలోనే చేర్యాలను మున్సిపాలిటీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్ రూమ్‌లు ఇళ్లు మంజూరుచేస్తున్నామని తెలిపారు.

1982లో సిద్దిపేట జిల్లా కోసం ఎన్టీఆర్‌కు కూడా దరఖాస్తు ఇచ్చానని గుర్తుచేసిన కేసీఆర్…ఏ ముఖ్యమంత్రి కూడా సిద్దిపేటను జిల్లా చేయలేదని తెలిపారు. ప్రజలందరి అండదండలతో రాష్ట్రాన్ని సాధించామని తెలిపిన సీఎం…10 జిల్లాలున్న తెలంగాణను పరిపాలన సౌలభ్యం కోసం 31 జిల్లాలుగా మార్చుకున్నామని చెప్పారు.నాకు జన్మనిచ్చింది,రాజకీయ జన్మనిచ్చింది సిద్దిపేట అని తెలిపిన సీఎం…. తనకు పోరాడే బలం, అనర్గళంగా మాట్లాడే గళం, తెలంగాణ సాధించే బలాన్ని ఇచ్చింది సిద్దిపేటని స్పష్టం చేశారు. తనకు జన్మనిచ్చిన సిద్దిపేట ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.

రూ.1300 కోట్లతో అన్ని జిల్లాల్లో కలెక్టర్‌,పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేట జిల్లాను చేయడం, దానిని ప్రారంభించడానికి రావడం తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. నా గురువుల దయతో ఈ మట్టిలో మొలిచిన మొక్కను నేను అని సీఎం అన్నారు. బతికి ఉండగానే కోరిన రాష్ర్టాన్ని సాధించుకున్నందుకు నా జన్మ ధన్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.సిద్దిపేట తెలంగాణకే గుండెకాయ అన్న సీఎం…హరీష్ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. జిల్లా అన్నిరంగాల్లో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.

Siddipet will be No 1 zilla
సిద్దిపేట మట్టిలో ఏం బలముందో గాని ఇక్కడినుంచి వెళ్లిన అనేకమంది బంగారు తెలంగాణ కోసం అహర్నిషలు పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. చరిత్రలో ఎవరు ఉహించని,చేయని విధంగా అద్భుత పథకాలతో ముందుకుపోతున్నామని తెలిపారు. తెలంగాణ   సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ 1గా నిలిచిందని కేంద్రమే తెలిపిందన్నారు.

కార్మికులకు ఉపాధి, పరిశ్రమలు రావడం, కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి  కోసం అహర్నిషలు పనిచేస్తున్న అధికారులకు శిరస్సువంచి నమస్కరిస్తున్నట్లు సీఎం తెలిపారు. కేసీఆర్‌ కిట్‌తో మహిళలకు చేయూతనిస్తున్నామన్నారు. పేదల సేవలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులందరిని అభినందించారు సీఎం. రైతులకు ఎంత సేవచేసిన తక్కువేనని తెలిపిన కేసీఆర్…రూ.1700 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కోసం భూ సర్వే చేపట్టామని తెలిపిన సీఎం…ఎకరాకు రూ.4వేల పెట్టుబడిని ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు.

రైతులు సంఘటితం కావాలన్న సీఎం…ఇకపై రైతులు నష్టపోకూడదని చెప్పుకొచ్చారు. ఇవాళ రైతులు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తిపంట వేశారని చెప్పిన సీఎం…మొట్టమొదటిసారి దేశంలో రైతులను సంఘటితం చేసే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైతులు అప్పుల బాధ నుంచి బయటపడాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను అడ్డుతగిలేందుకు కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు సీఎం. సిద్దిపేటకు రైలు మార్గం కూడా త్వరలో రాబోతుందన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు వినోద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రామలింగారెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -