నిన్న కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. 225 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ఏ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్నా 113 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కర్ణాటకలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని తెలిజేస్తుండడంతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారట. అయితే ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఏ మాత్రం కలవరం చెందలేదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి రెండు రోజుల వినోదం పంచేవి మాత్రమే అంటున్నారు.
‘ఒక నది సగటున 4 అడుగుల లోతు ఉందంటూ ఓ గణాంకకుడు చెప్పిన వివరాల ఆధారంగా ఓ వ్యక్తి ఆ నదిలో నడుచుకుంటూ వెళ్లడం అసాధ్యం. ఎగ్జిట్ పోల్స్ సైతం ఈ తరహా గణాంకాలపైనే ఆధారపడతాయి. కనుక నా ప్రిమయైన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఎగ్జిట్ పోల్స్ గురించి ఆందోళన చెందకండి’’ అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం దుందిబి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కర్ణాటక ఎన్నికల ఫలితాలే రెండు జాతీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఇప్పిటికే వరుస విజయాలతో 22 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కర్ణాటకలోనూ బీజేపీ జెండా ఎగుర వేసి మోడీ మేనియా చూపించాలనుకుంటుంది. మరోవైపు రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా జరుగుతున్న ఎన్నికలు కావున ఆయన కర్ణాటక ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలకు రాహుల్ నాయకత్వంపై నమ్మకం కలగాలంటే కన్నడనాట మళ్లీ హంగ్ ఏర్పడాల్సిందే. మరి కన్నడలో మోడీ మేనియా పనిచేసిందా.. రాహుల్ నాయకత్వం నిలబడతుందా తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.