కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ వేడి పులుముకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో సిద్దారామయ్య ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయిందని ఆయన అన్నారు. వరుసగా 12 రాష్ట్రాలలో కాంగ్రెస్ ని బీజేపీ మట్టి కరిపించిందని, కర్ణాటకలో సైతం అదే కంటిక్యూ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుంగుంఢ్ నియోజకవర్గంలో ప్రసంగిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సిద్దారామయ్యపై ఎన్నో ఆశలు పెట్టుకుందని.. బాదామిలో కూడా ఆయనతో బలవంతంగా పోటీ చేయిస్తోందన్నారు. అక్కడ ఆయన ఓడిపోవడం ఖాయమని చెప్పారు. కర్ణాటకలో ఈ సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని… అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. బీజేపీ తరపున యెడ్యూరప్పను గెలిపిస్తే కర్ణాటకను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో కర్ణాటలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోని చూస్తూనే కర్ణాటక ప్రజల మనసులో ఏముందో చెప్పవచ్చన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నఅన్ని అంశాలు పూర్తి చేశామని గుర్తుచేశారు. ఈ మేనిఫెస్టోలో విడుదల చేసిన అన్ని అంశాలను చేసి చూపిస్తామని రాహుల్ అన్నారు