తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే తీవ్రమైన పరిణామాలు!

1
- Advertisement -

తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన తెలంగాణ తల్లి రూపాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ కమీషన్ల మాజీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వారు మాట్లాడుతూ.. రేవంత్ తెలంగాణ తల్లి రూపం జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ సందర్భంగా శుభప్రద పటేల్ మాట్లాడుతూ.. రచయితలు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కలిసి సమావేశం పెట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. తెలుగు తల్లి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని కుట్ర చేయడానికి సమైక్యవాదులు ప్రయత్నిస్తే.. బతుకమ్మ, తెలంగాణలో పండే పంటలు, ఇక్కడ నేసే పట్టు చీరతో తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సుసంపన్నంగా ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో భరతమాత అని, కర్ణాటకలో కర్ణాటక మాత అని, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుతల్లి అని ఏ విధంగా ఉన్నాయో.. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న శక్తులన్నీ కలిసి తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసుకోవడం జరిగింది. తెలంగాణ పదాన్నే నిషేధించినటువంటి సమయంలో మాకు కూడా ఒక అస్తిత్వం ఉంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని నలుమూలల వేల విగ్రహాలని ఏర్పాటు చేసుకున్నాం అని అన్నారు.

రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణ తల్లి కిరీటం తీసేస్తాం.. చేతిలో ఉన్నటువంటి బతుకమ్మని తీసేస్తాం, నగలను తీసేస్తాం అని ఒక కుట్ర పన్నే ప్రయత్నం చేస్తుండు.. దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి.. భరతమాత రూపాన్ని కాని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న రూపాలను కానీ మార్చలేదు. తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మారిస్తే భస్మమవుతారు అని హెచ్చరిస్తున్నాం అని పేర్కొన్నారు.

గతంలో కూడా తెలంగాణ చిహ్నాన్ని మార్చే కుట్ర చేసింరు.. దాని ప్రజలు, మేధావులు తీవ్రంగా ప్రతిఘటిస్తే దాన్ని చర్చిస్తా అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి సీక్రెట్‌గా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తుండు. క్యాబినెట్ మంత్రులకు కూడా తెల్వకుండా విగ్రహ రూపకల్పన పర్యవేక్షించి వస్తున్నడు. ఇంత సీక్రెట్‌గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే అవసరం ఏమున్నది అని వారు ప్రశ్నించారు.

ఎవరితో చర్చలు చేయకుండా ఉద్యమ సమయంలో తయారు చేసిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న రేవంత్.. ఇందిరమ్మ అలోచన విధానాలను వ్యతిరేకంగా తెలంగాణలో ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రేవంత్ కుట్ర పన్నుతున్నాడు అని ఆరోపించారు.

సమైక్యవాదులతో చేతులు కలిపి, తెలంగాణ ఉద్యమకారులు మీద రేవంత్ తుపాకీ ఎక్కుపెట్టిన విషయం ఎవరు మర్చిపోలేదు. తెలంగాణ అస్తిత్వం మీదకి వస్తే.. పార్టీలకి అతీతంగా తెలంగాణ సమాజమంతా ఏకమైతది. మన తల్లి మీద దాడి చేస్తుంటే తెలంగాణ ఉద్యమంలో లాగా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి మీద పోరాడాల్సిన అవసరం ఉంది అని పిలుపునిచ్చారు.అధికారం మారగానే భరతమాత రూపం మార్చారా? తెలుగుతల్లి రూపాన్ని మార్చారా? అని వారు ఈ సంధర్బంగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అడిగారు. తెలంగాణ తల్లి జోలికి వస్తె తీవ్రమైన పరిణామాలు ఉంటాయని.. అలాంటి ఏమైనా అలోచన ఉంటే తక్షణమే విరమించుకోవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Also Read:బీఆర్ఎస్ పాలన..తెలంగాణ ప్రగతికి బాటలు

- Advertisement -